అవకాశాలు అనేకం.. అందిపుచ్చుకోవడమే కీలకం: మోడీ
న్యూఢిల్లీ: భారత్ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశ ఆర్థిక వృద్ధి చైనా కంటే మెరుగ్గా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ (Bloomberg New Economy Forum)లో పాల్గొన్న ఆయన భారత వృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, డిజిటల్ నైపుణ్యాల ప్రాధాన్యాన్ని వివరించారు. భారత ఆర్థిక వృద్ధి (Economic Growth) 7 శాతంగా ఉందని మోదీ తెలిపారు. దేశంలో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయని, వినియోగం ఆర్థిక పురోగతిలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ సరైన గమ్యస్థానమని స్పష్టం చేశారు.
డిజిటల్ నైపుణ్యాలు (Digital Skills) భారత్ అభివృద్ధిలో కీలక మార్పునకు దోహదపడతాయని ప్రధాని అన్నారు. ప్రపంచాన్ని మార్చడంలో భారత్ ముందంజలో ఉందని పేర్కొన్నారు. దేశాన్ని వికసిత్ భారత్ (Viksit Bharat)గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. దేశంలో సుమారు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని మోదీ వెల్లడించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఆర్థిక అవకాశాలను విస్తరించడం ద్వారా అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తున్నామని వివరించారు. కరోనా మహమ్మారి సమయంలో భారత్ ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు అందించిందని ప్రధాని గుర్తుచేశారు. సంక్షోభ సమయంలోనూ ఇతర దేశాలకు సహాయం చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో తన బాధ్యతను నిర్వర్తించిందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించే దిశగా ముందుకు సాగుతోందని మోదీ అన్నారు.