ఐఎస్‌బీ క్యాంపస్‌లో ఉద్యోగాల సందడి!

27-11-2026 | 05:00am

హైదరాబాద్: తక్కువ పని అనుభవంతోనే భారీ స్టైపెండ్ అందుకునే అవకాశం వస్తే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు! ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ విద్యార్థులు ఇలాంటి అరుదైన అవకాశాలను సొంతం చేసుకున్నారు. 2026–28 విద్యా సంవత్సరానికి చెందిన రెండో బ్యాచ్ సమ్మర్ ఇంటర్న్‌షిప్(Internship) నియామకాల్లో ఆకట్టుకునే ఫలితాలు సాధించింది.

మొత్తం 130 మంది విద్యార్థులున్న ఈ బ్యాచ్‌లో ఒక్కొక్కరికి సగటున 9 నెలల పని అనుభవం మాత్రమే ఉంది. అయినప్పటికీ, 45 కంపెనీల నుంచి 200కు పైగా ఇంటర్న్‌షిప్ ఆఫర్లు వచ్చాయి. రెండు నెలల కాలవ్యవధి కలిగిన ఈ ఇంటర్న్‌షిప్‌లకు సగటు స్టైపెండ్ రూ.3.44 లక్షలుగా నమోదైంది. అత్యధికంగా ఒక విద్యార్థికి రూ.7.9 లక్షల స్టైపెండ్ ఆఫర్ లభించింది.

కన్సల్టింగ్, ఫైనాన్స్ రంగాల్లో భారీ డిమాండ్

కన్సల్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ విభాగాలు కలిపి 117 ఆఫర్లను అందించాయి. యాక్సెంచర్ సొల్యూషన్స్ 29 ఆఫర్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈవై-పార్తెనాన్ 17, డెలాయిట్ కన్సల్టింగ్ 9 ఆఫర్లను అందించాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, మాస్టర్‌కార్డ్ సంస్థలు చెరో 8 ఆఫర్లతో నిలిచాయి. బెయిన్ అండ్ కంపెనీ, అల్వారెజ్ అండ్ మార్సల్, పీడబ్ల్యూసీ ఏసీ ఇండియా సంస్థలు తలా 7 ఆఫర్లు ఇచ్చాయి.

టెక్నాలజీ రంగంలోనూ అవకాశాల వెల్లువ

టెక్నాలజీ కంపెనీల నుంచి మొత్తం 27 ఇంటర్న్‌షిప్ ఆఫర్లు వచ్చాయి. పర్పుల్ 6 ఆఫర్లతో ముందుండగా, గూగుల్, స్విగ్గీ, శాంసంగ్, ఫిలిప్స్ సంస్థలు చెరో 5 ఆఫర్లు అందించాయి. అమెజాన్ డెవలప్‌మెంట్ సెంటర్ ఇండియా కూడా ఈ నియామకాల్లో పాల్గొంది.

ఎఫ్‌ఎంసీజీ రంగంలో 17 ఆఫర్లు

వినియోగ వస్తువుల తయారీ రంగానికి చెందిన సంస్థలు 17 ఆఫర్లను ప్రకటించాయి. హిందుస్థాన్ యూనిలివర్, డాబర్ సంస్థలు చెరో 6 ఆఫర్లతో ముందంజలో నిలిచాయి. హేలియన్, ఐటీసీ, లొరియల్, క్యాస్ట్రాల్ సంస్థలు కూడా విద్యార్థులకు అవకాశాలు కల్పించాయి.

బహుళ రంగాల సంస్థల నుంచి 16 ఆఫర్లు

వివిధ వ్యాపార రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలు మొత్తం 16 ఆఫర్లను అందించాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 6 ఆఫర్లతో ముందుండగా, టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ 4 ఆఫర్లు ఇచ్చింది. ఆదిత్య బిర్లా గ్రూప్, గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ కూడా నియామకాల్లో పాల్గొన్నాయి.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇతర రంగాలకు చెందిన పలు సంస్థలు సైతం విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. మొత్తంగా చూస్తే, తక్కువ పని అనుభవం ఉన్న యువ మేనేజ్‌మెంట్ విద్యార్థులకు కూడా ప్రముఖ కంపెనీల నుంచి మంచి అవకాశాలు లభించవచ్చని ఈ ఇంటర్న్‌షిప్ ఫలితాలు సూచిస్తున్నాయి.

మరిన్ని వార్తలు