పెరిగిన పసిడి, వెండి ధరలు

09-09-2026 | 05:25am

24 క్యారెట్లు 10 గ్రాములకు 1.60 లక్షలు

కేజీ వెండి ధర రూ.2,43,200

తులం గోల్డ్‌పై రూ.4వేలు, కేజీ వెండిపై రూ.6వేలు పెరుగుదల

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): గత కొన్ని రోజులుగా పెరగాలా? వద్దా? అని ఊగిసలాడుతున్న బంగారం(Gold), వెండి(Silver) ధరలు మళ్లీ రెక్కలొచ్చాయి. దేశీయ విపణిలో ఒక్కసారిగా దూకుడును ప్రదర్శించాయి. మంగళ వారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,59,900 పలికింది. సోమవారంతో పోల్చుకుంటే ఇది రూ.4వేలు పెరిగింది. ఇక కేజీ వెండి ధర రూ.2,43,200 పలికింది. సోమవారంతో పోల్చుకుంటే రూ.6వేలు పెరిగింది.

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, డాలర్ విలువ తగ్గడం, చమురు ధరల ఎగుడుదిగుడులతో బంగారం, వెండి ధరల్లో పెరుగుదల ఏర్పడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 4435.20 డాలర్లకు చేరింది. ఔన్సు వెండి ధర 67 డాలర్లు పలికింది. కమొడిటీ ఎక్స్‌ఛేంజ్‌లోనూ ఈ లోహాల ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.1.53లక్షలు, సిల్వర్ ఫ్యూచర్స్ కేజీ ధర రూ.2.41లక్షలుగా నసాగుతోంది. 

దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి డిమాండ్ కొనసాగడం, పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  ఏది ఏమైనా ఒకప్పుడు 20, 30వేల రూపాయలుగా ఉన్న బంగారం ధరలు కాస్త ఇప్పుడు మెడలో, చేతిలో ధరించాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక బీద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మాత్రం పసిడి కొనాలంటే ఊహించని భారంగా మారింది. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల మరోమారు పసిడిని మరో ఏడాదిపాటు కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు