డిజిటల్ యాడ్స్‌లో భారీ మోసాలు..
ముంబై: సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్(Digital Platforms)లలో కనిపించే ప్రకటనలను గుడ్డిగా నమ్మితే ఇబ్బందులు తప్పవా? తాజాగా వెలువడిన అర్ధవార్షిక నివేదికలోని గణాంకాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గుర్తించిన ప్రకటనల నిబంధనల ఉల్లంఘనల్లో ఏకంగా 98 శాతం డిజిటల్ మాధ్యమాల్లోనే చోటుచేసుకున్నాయి. దీంతో ఆన్లైన్ ప్రకటనల విశ్వసనీయత, వినియోగదారుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.
అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) విడుదల చేసిన 2026-27 అర్ధవార్షిక నివేదిక ప్రకారం.. ఆరు నెలల వ్యవధిలో 2,308 ప్రకటనలకు సంబంధించి వచ్చిన 3,951 ఫిర్యాదులను పరిశీలించారు. వీటిలో 94 శాతం ప్రకటనల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అంతేకాకుండా 72 శాతం ప్రకటనలు తప్పుడు వాదనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తేలింది. మరో 30 శాతం ప్రకటనలు హానికరమైన ఉత్పత్తులు లేదా ప్రమాదకర పరిస్థితులను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడైంది.
మెటా ప్లాట్‌ఫామ్‌లపైనే అత్యధిక ఉల్లంఘనలు
ప్రకటనల నిబంధనల ఉల్లంఘనల్లో మెటా ప్లాట్‌ఫామ్‌ల వాటా 73.4 శాతంగా నమోదైంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య అక్కడ 1,563 ప్రకటనలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 90 శాతం స్పాన్సర్డ్ ప్రకటనలే కావడం గమనార్హం. మరో 41 శాతం ప్రకటనలు నిషేధిత కేటగిరీలకు చెందినవిగా గుర్తించారు. ముఖ్యంగా విదేశాల నుంచి నిర్వహించే అక్రమ బెట్టింగ్ ప్రకటనలు అధికంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. వీటిపై తదుపరి చర్యల కోసం సంబంధిత నియంత్రణ సంస్థలకు, మెటాకు సమాచారం అందించారు.
ఫిర్యాదులు చేయకముందే గుర్తింపు
ప్రకటనలపై పర్యవేక్షణ వ్యవస్థ ఎంత కీలకమో ఈ నివేదిక మరోసారి స్పష్టం చేసింది. గుర్తించిన ఉల్లంఘనల్లో 85 శాతం ఏఎస్సీఐ స్వయంగా చేపట్టిన పరిశీలన ద్వారా వెలుగులోకి వచ్చాయి. అంటే వినియోగదారులు ఫిర్యాదు చేసే వరకు వేచి చూడకుండా అనుమానాస్పద ప్రకటనలను గుర్తించే విధానానికి ప్రాధాన్యం పెరిగింది.
ప్రజల్లోనూ పెరుగుతున్న అవగాహన
ప్రకటనలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో 1,124గా ఉన్న ఫిర్యాదులు, 2026-27లో అదే వ్యవధికి 1,347కు చేరాయి. ఇది 20 శాతం వృద్ధి. వీటిలో 84 శాతం ఫిర్యాదులు ఏఎస్‌సీఐకి చెందిన 'తారా' డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందాయి.
నిషేధం తర్వాతా బెట్టింగ్ ప్రకటనల జోరు?
ఆన్లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన ప్రకటనలు కొనసాగుతుండటం మరో ఆందోళనకర అంశంగా మారింది. ఆన్లైన్ గేమింగ్ నియంత్రణకు 2025లో చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ, నిషేధిత కేటగిరీలకు చెందిన ప్రకటనలు డిజిటల్ వేదికలపై కనిపించడం వినియోగదారుల రక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. డిజిటల్ ప్రకటనల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై పర్యవేక్షణ, పారదర్శకత, బాధ్యతాయుత ప్రచారం మరింత అవసరమని ఈ నివేదిక సూచిస్తోంది.