ఫార్మా రంగానికి గ్లోబల్ బూస్ట్..

21-10-2026 | 06:15pm

ఎనర్జాన్ ల్యాబ్స్‌ను కొనుగోలు చేసిన కోటెక్నా!

హైదరాబాద్: తెలంగాణ ఫార్మాస్యూటికల్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ టెస్టింగ్, ఇన్‌స్పెక్షన్, సర్టిఫికేషన్ సేవల సంస్థ కోటెక్నా (Cotecna), హైదరాబాద్‌కు చెందిన ఎనర్జాన్ ల్యాబ్స్‌(Energon Labs)ను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంతో అంతర్జాతీయ ఔషధ పరీక్షల మార్కెట్‌లో కోటెక్నా తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది.

ఎనర్జాన్ ల్యాబ్స్‌ ఔషధాలు, బయోఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు, ప్యాకేజింగ్‌కు సంబంధించిన నాణ్యత పరీక్షలు, విశ్లేషణ సేవలను అందిస్తోంది. cGMP ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఈ ల్యాబ్‌కు ISO 9001:2015, ISO/IEC 17025:2017 ధ్రువీకరణలు ఉన్నాయి. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) తనిఖీలను కూడా ఎదుర్కొన్నట్లు సంస్థకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్నాయి.

ఈ కొనుగోలుతో ఫార్మా టెస్టింగ్ సేవలు, ఔషధ నాణ్యత పరీక్షలు, బయోఫార్మా విశ్లేషణ వంటి విభాగాల్లో కోటెక్నా సామర్థ్యం పెరగనుంది. ముఖ్యంగా భారత్‌తో పాటు అమెరికా, ఆసియా పసిఫిక్, మధ్యప్రాచ్య మార్కెట్లలోని ఔషధ తయారీ సంస్థలకు మరింత విస్తృతంగా సేవలు అందించే అవకాశం ఏర్పడనుంది.

ఎనర్జాన్ ల్యాబ్స్‌ అనలిటికల్ పద్ధతుల అభివృద్ధి, స్థిరత్వ పరీక్షలు, మలినాల విశ్లేషణ, ప్యాకేజింగ్ అనుకూలత పరీక్షలు, పెప్టైడ్లు, ఒలిగోన్యూక్లియోటైడ్ల విశ్లేషణ వంటి ప్రత్యేక సేవలను అందిస్తోంది. ఈ నైపుణ్యాలు అంతర్జాతీయ నాణ్యత, నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఔషధాలను తయారు చేసే కంపెనీలకు ఉపయోగపడనున్నాయి.

హైదరాబాద్ ఇప్పటికే దేశంలోని ప్రముఖ ఫార్మా, బయోటెక్నాలజీ కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడి శాస్త్రీయ నైపుణ్యం, ఆధునిక ప్రయోగశాలలు, ఔషధ తయారీ సంస్థల ఉనికి అంతర్జాతీయ కంపెనీలకు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎనర్జాన్ కొనుగోలుతో ఈ రంగంలో కోటెక్నా ఉనికి మరింత బలోపేతం కానుంది.

కోటెక్నా గ్రూప్ సీఈఓ సెబాస్టియన్ డన్నాడ్ మాట్లాడుతూ, భారత్‌లో లైఫ్ సైన్సెస్ టెస్టింగ్ సేవలను విస్తరించాలన్న తమ లక్ష్యానికి ఈ కొనుగోలు కీలక అడుగని పేర్కొన్నారు. భారత ఫార్మా మార్కెట్‌లో సంస్థ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు