అమరవీరుల త్యాగాలకు కొవ్వొత్తుల ర్యాలీతో ఘననివాళి
వరంగల్ సీపీ ఎన్. శ్వేత..
హనుమకొండ, అక్టోబర్ 21 (విజయక్రాంతి): అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారికి ఘన నివాళులర్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత(Police Commissioner N. Swetha) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ హనుమకొండలోని అశోక జంక్షన్ నుంచి ప్రారంభమై,పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుంది. అక్కడ అమరవీరుల స్థూపం వద్ద పోలీసు అధికారులు, సిబ్బంది అమర వీరులకు నివాళులర్పించారు.దేశ భద్రత, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అందిస్తున్న సేవలను, విధి నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రజలకు తెలియజేయడం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సాహసాన్ని, అంకితభావాన్ని స్మరించుకోవడంలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వర్దన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు, ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, అడిషనల్ డిసిపి పరిపాలన రాయల ప్రభాకర్ రావు, అడిషనల్ డిసిపిలు, సురేష్, శ్రీనివాస్, ఏసీపీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్ ఎస్‌ఐలు పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.