పోలీసులకు కొత్త సవాళ్లు.. డీజీపీ కీలక వ్యాఖ్యలు!
సైబర్ నేరాలు, నార్కోటిక్స్‌పై డీజీపీ కీలక వ్యాఖ్యలు!
హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం(Police Martyrs Day) నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పోలీస్ స్మారక పరేడ్(Police Martyrs Memorial Parade)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand) హాజరయ్యారు. అమరవీరులకు నివాళులర్పిస్తూ వారి సేవలను స్మరించుకున్నారు.
ఇవి కూడా చదవండి: క్రిమినల్స్‌తో ఫ్రెండ్లీగా ఉండొద్దు: సీఎం
తెలంగాణలో గతంతో పోలిస్తే పరిస్థితులు ఎంతో మారాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఒకప్పుడు పోలీసు అమరవీరుల జాబితాలో ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం అటువంటి ఘటనల్లో అమరులవుతున్న పోలీసుల సంఖ్య తగ్గడం సంతోషకరమని పేర్కొన్నారు. కర్రెగుట్టల వంటి ప్రాంతాలకు ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో నక్సలిజం సమస్య తగ్గుముఖం పట్టడంతో పోలీసు వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్ల స్వరూపం కూడా మారుతోందని వివరించారు.
పోలీసులకు కొత్త సవాళ్లు.. సైబర్ నేరాలు, నార్కోటిక్స్‌పై దృష్టి
నక్సలిజం సమస్య తగ్గుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసు శాఖకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి అంశాలు కొత్త సవాళ్లుగా మారాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ నేరాల విధానాలు కూడా మారుతున్నాయని, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ తన విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు వ్యవస్థలో మార్పులు చేపడుతున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ, నార్కోటిక్స్ నెట్‌వర్క్‌లపై నిఘా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలు పోలీసు శాఖకు కీలకంగా మారుతున్నాయి.
ఇవి కూడా చదవండి: ఏపీలో పల్లెపోరు షురూ.. నేటి నుంచే నామినేషన్లు
పోలీసు సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి
పోలీసుల సంక్షేమానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని డీజీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణలో నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసు సిబ్బందికి అవసరమైన సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
అమరవీరుల త్యాగాలకు ఘన నివాళి
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం వారి త్యాగాలను గుర్తుచేసుకోవడంతో పాటు, ప్రజల రక్షణలో పోలీసు వ్యవస్థ పోషించే కీలక పాత్రను మరోసారి చాటిచెప్పింది.