భారత్‌లో అమెజాన్ భారీ పెట్టుబడి

17-11-2026 | 04:59pm

న్యూఢిల్లీ: ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్(Amazon) భారత్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. పునరుత్పాదక ఇంధన రంగంలో 2030 నాటికి 7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.65,393 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దేశంలో స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో పాటు తన గ్రీన్ ఎనర్జీ(Green Energy Projects) సామర్థ్యాన్ని మరింత విస్తరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్‌లో కుదుర్చుకున్న 4 బిలియన్ డాలర్ల పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు ఈ కొత్త ప్రకటన అదనం.

నాలుగు కొత్త విద్యుత్ ప్రాజెక్టులు

తన గ్రీన్ ఎనర్జీ ప్రణాళికలో భాగంగా అమెజాన్ మొత్తం 934 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రకటించింది. వీటిలో కర్ణాటకలో 234 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు, అదే రాష్ట్రంలో 200 మెగావాట్ల హైబ్రిడ్ సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టు ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్‌లో 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు(Solar power project), రాజస్థాన్‌లో 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును చేపట్టనుంది. కర్ణాటకలో ఏర్పాటు చేయనున్న 234 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఆసియాలో అమెజాన్ ఒప్పందం చేసుకున్న అతిపెద్ద పవన విద్యుత్ ప్రాజెక్టుగా నిలవనుంది.

35 లక్షల ఇళ్లకు సరిపడా విద్యుత్!

ఈ ప్రాజెక్టులన్నీ అందుబాటులోకి వస్తే భారత్‌లో అమెజాన్ ఒప్పందం చేసుకున్న పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 2 గిగావాట్లకు మించనుంది. తద్వారా ఏటా 35 లక్షలకు పైగా భారతీయ గృహాల విద్యుత్ అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని సంస్థ వెల్లడించింది.

2040 నాటికి నెట్‌జీరో లక్ష్యం

కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా అమెజాన్ కీలక లక్ష్యాలను ప్రకటించింది. 2030 నాటికి తన కార్యకలాపాలకు వినియోగించే విద్యుత్ వల్ల ఏర్పడే కర్బన ఉద్గారాల తీవ్రతను 2019 స్థాయితో పోలిస్తే 65 శాతం తగ్గించాలని నిర్ణయించింది. అలాగే 2040 నాటికి తన కార్యకలాపాల్లో నెట్‌జీరో కార్బన్ లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది.

భారత్‌లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని అమెజాన్ పేర్కొంది. ఈ నిర్ణయంతో దేశంలోని పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు