మహిళా కండక్టర్‌పై దాడి అమానుషం
- దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
- టిడబ్ల్యుయూ ఖమ్మం రీజినల్ కార్యదర్శి ఆర్పినేని కృష్ణ డిమాండ్
మణుగూరు, అక్టోబర్ 25 (విజయక్రాంతి): అశ్వాపురం మండలం(Aswapuram Mandal) మిట్టగూడెం గ్రామం సమీపంలో ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ ప్రవళికపై జరిగిన దాడిని తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టిడబ్ల్యుయూ) ఖమ్మం రీజినల్ కార్యదర్శి ఆర్పినేని కృష్ణ తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌ను బస్సులో నుంచి తోసేసిన ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
మణుగూరు డిపోకు చెందిన బస్సులో జరిగిన ఈ ఘటనలో మహిళా కండక్టర్ ప్రవళికను ఓ మహిళా ప్రయాణికురాలు నడుస్తున్న బస్సులో నుంచి తోసివేసినట్లు కృష్ణ తెలిపారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రం ప్రవళిక కాళ్లపై నుంచి వెళ్లడంతో తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయని, కుడికాలు విరగడంతో పాటు మరో కాలుకు కూడా తీవ్ర గాయమైందని పేర్కొన్నారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు పెరుగుతున్నాయని కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
విధి నిర్వహణలో ఉన్న కార్మికులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని, పోలీసు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.గాయపడిన మహిళా కండక్టర్ ప్రవళికకు కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, ఆమె పూర్తిగా కోలుకునే వరకు ఐఓడీ (ఇన్జ్యూరీ ఆన్ డ్యూటీ) సదుపాయం కల్పించి వేతనం చెల్లించాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆర్పినేని కృష్ణ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల భద్రతకు ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.