ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
ఇల్లెందు,(విజయక్రాంతి): కొమరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Kommaram Primary Health Center)లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, సూపర్‌వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, పీవైఎల్ ఆధ్వర్యంలో శనివారం ప్రధాన రహదారిపై రాస్తారోకో, ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు.
23 వేల జనాభాకు ఒకే ఆరోగ్య కేంద్రం ఉండగా, ఒక్క డాక్టర్‌తో వైద్యసేవలు అందించడం వల్ల పేద ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మందుల కొరత, విషజ్వరాల రక్తపరీక్షల నివేదికల్లో జాప్యంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఖాళీలను భర్తీ చేసి పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని, లేనిపక్షంలో దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యదలపల్లి సత్యం, పొడుగు నరసింహారావు, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.