బతుకమ్మలోనూ కుల వివక్ష.. దళిత సర్పంచికి అవమానం!

10-10-2026 | 11:18pm
  1. మాదిగ మహిళల బతుకమ్మలపై అభ్యంతరం.. ఆటలు నిలిపివేసిన మహిళలు
  2. అమ్మనబోలులో ఘటన.. రాత్రి 11.30 గంటల వరకు సాగాల్సిన వేడుకలు 7.30 గంటలకే ముగింపు
  3. మాటూరులోనూ ఎస్సీ, బీసీ మహిళలు వేర్వేరుగా బతుకమ్మ ఆటలు

ఆలేరు, అక్టోబర్ 10 (విజయక్రాంతి): మహిళలంతా కులమతాలకు(Caste and religion) అతీతంగా ఐక్యంగా జరుపుకోవాల్సిన బతుకమ్మ పండుగలో(Bathukamma Festival) కుల వివక్ష(Caste discrimination) చోటుచేసుకుందనే ఆరోపణలు కలకలం రేపాయి. యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) మోటకొండూరు మండలం అమ్మనబోలులో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి(SC Madiga community) చెందిన గ్రామ సర్పంచి మామిడాల నర్సమ్మకు బతుకమ్మ వేడుకల్లో అవమానం ఎదురైనట్లు తెలిసింది. సర్పంచి, వార్డు సభ్యురాలు బొజ్జ శ్రీలత తీసుకొచ్చిన బతుకమ్మలను ఇతర మహిళల బతుకమ్మలతో కలిపి ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం కావడంతో వేడుకలు అర్ధాంతరంగా ముగిశాయి.

బతుకమ్మలను కలపడంతో అభ్యంతరం! : 

గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు బతుకమ్మ ఆడుతుండగా, సర్పంచి మామిడాల నర్సమ్మ, వార్డు సభ్యురాలు బొజ్జ శ్రీలత తదితరులు అక్కడికి వెళ్లారు. తమ బతుకమ్మలను వారితో కలిసి ఉంచి ఆటలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. అయితే, మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళలు బీసీ మహిళల బతుకమ్మలతో కలిసి ఎలా ఆడుతారంటూ కొందరు మహిళలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సర్పంచి తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన సర్పంచి, వార్డు సభ్యురాలు తమ బతుకమ్మలను తీసుకుని గ్రామంలోని పోచమ్మ గుడి వద్దకు వెళ్లారు.

ఆటలు నిలిపివేసి వెళ్లిపోయిన మహిళలు : పోచమ్మ గుడి వద్ద ఇతర మహిళలు బతుకమ్మ ఆడుతుండగా, సర్పంచి, వార్డు సభ్యురాలు తీసుకొచ్చిన బతుకమ్మలను అక్కడి బతుకమ్మలతో కలిపి ఉంచారు. దీంతో అప్పటివరకు ఆటల్లో పాల్గొంటున్న మహిళలు ఒక్కసారిగా ఆటను నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. సాధారణంగా రాత్రి 11.30 గంటల వరకు సందడిగా సాగే బతుకమ్మ వేడుకలు ఈసారి రాత్రి 7.30 గంటలకే ముగియడం చర్చనీయాంశంగా మారింది.

సర్పంచికే కుల వివక్ష సెగ! : గ్రామానికి ప్రథమ పౌరురాలిగా ఉన్న సర్పంచికే సామాజిక వర్గం పేరుతో అవమానం ఎదురైనట్లు ఆరోపణలు రావడం స్థానికంగా చర్చకు దారితీసింది. పూలను పేర్చి ప్రకృతిని పూజిస్తూ మహిళలంతా కలిసి జరుపుకునే బతుకమ్మ పండుగలో కులాల పేరుతో వేర్పాటు ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పండుగలు సామాజిక ఐక్యతకు వేదికలు కావాల్సి ఉండగా, ఇలాంటి ఘటనలు సమాజంలోని అంతరాలను బయటపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై సర్పంచి మామిడాల నర్సమ్మ మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా ఈసారి మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళలు బీసీ మహిళల బతుకమ్మలతో కలిసి ఎలా పెడతారంటూ ఓ బీసీ మహిళ వ్యాఖ్యానించిందని తెలిపారు. వార్డు సభ్యురాలు బొజ్జ శ్రీలత మాట్లాడుతూ, తాము తీసుకొచ్చిన బతుకమ్మను అక్కడి బతుకమ్మలతో కలిపి ఉంచగానే మహిళలు ఆటను నిలిపివేసి వెళ్లిపోయారని పేర్కొన్నారు.

మాటూరులోనూ వేర్వేరుగా బతుకమ్మలు : ఇదిలా ఉండగా, అదే మోటకొండూరు మండలంలోని మాటూరు గ్రామంలోనూ ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలు వేర్వేరుగా బతుకమ్మ ఆడినట్లు సమాచారం. పండుగలు కులమతాలకు అతీతంగా ప్రజలను ఒక్కటి చేయాల్సి ఉండగా, ఇలాంటి ఘటనలు సామాజిక ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. కుల వివక్షకు తావులేకుండా అన్ని వర్గాల ప్రజలు సమాన గౌరవంతో పండుగలు జరుపుకునే పరిస్థితులు రావాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు