పట్టభద్రుల సమస్యలపై మండలిలో గళం వినిపిస్తా

23-11-2026 | 11:56pm

ఇల్లెందు టౌన్, నవంబర్ 23 (విజయక్రాంతి): ఉద్యమాల గడ్డ నుంచి వస్తున్న తనను పట్టభద్రులు ఆశీర్వదించి, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఉమ్మడి వరంగల్–ఖమ్మం–నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ నలమాస క్రిష్ణ గౌడ్(Nalamaasa Krishna Goud) కోరారు. సోమవారం మండల పరిధిలోని కొమరారం గ్రామంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

గతంలో ఐదుసార్లు ఎన్నికలు జరిగినప్పటికీ గెలిచిన ప్రజాప్రతినిధులు పట్టభద్రుల సమస్యలపై మండలిలో సమర్థంగా మాట్లాడలేదని విమర్శించారు. రాజకీయ పార్టీలు ఒకవైపు నిరుద్యోగ సమస్యలను సృష్టిస్తూ మరోవైపు వాటిని పరిష్కరిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పట్టభద్రులను ఉపయోగించుకోవడం బాధాకరమన్నారు.

రెండు ప్రధాన పార్టీలు అగ్రవర్ణాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం, బలహీన వర్గాలకు అవకాశం కల్పించకపోవడం సరికాదని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలకు సమన్యాయం, ఆత్మగౌరవం కల్పించడంతో పాటు పట్టభద్రుల హక్కుల కోసం పోరాడాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య తన పోరాట స్ఫూర్తి, సామర్థ్యాలను గుర్తించి తన అభ్యర్థిత్వానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారని వెల్లడించారు.

తాను ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఉద్యోగ నియామకాల కోసం పోరాటం, విద్యారంగ సమస్యల పరిష్కారం, నిరుద్యోగ సమస్య నిర్మూలన, మహిళా పట్టభద్రులకు ప్రత్యేక ప్రాధాన్యత, పోటీ పరీక్షలకు ఉచిత సహకారం, పట్టభద్రుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు, ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాల కల్పన, పారదర్శకమైన ప్రజాప్రతినిధిత్వం, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చైతన్యవంతులైన పట్టభద్రులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

మరిన్ని వార్తలు