అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
ముక్కోటి ఉత్సవాల్లోపు పూర్తి చేయాలి
పుష్కరాల నాటికి ఘాట్‌ను సిద్ధం చేయాలి
అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి
భద్రాచల ఆలయ సందర్శన
భద్రాచలం, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయాన్ని శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) దర్శించుకున్నారు. కలెక్టర్ అంకిత్, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినా రాయణ లతో కలసి దేవాలయానికి చేరుకున్నారు.
మంత్రి పొంగులేటి సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పొంగులేటి పరిశీలించారు. చిత్రకూట మండపం పరిసరాలను, గోశాల ప్రాంతాన్నీ, అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్, శివాలయానికి వెళ్లే మార్గం, ఉత్తర ద్వార దర్శనం, రామాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు మాడవీధులను, పరిసర ప్రాంత అభివృద్ధి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అభివృద్ధికి సంబంధించిన వివరాల ను సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్స్ ను, ఆర్కిటెక్చర్లను సకాలంలో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ఆదేశించారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో జరిగే ముక్కోటి ఉత్సవాలలోపు ఉత్తర ద్వారా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలలోపు అన్ని పనులు పూర్తయ్యాలా చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
వచ్చే ఏడాది జూన్ నెలలో జరిగే గోదావరి పుష్కరాల ప్రారంభంలోపు గోదావరి పరివాహక ప్రాంతంలో గల గోదావరి ఘాట్లు నిర్మాణాలు అభివృద్ధి పనులు పూర్తిచేసేలా చర్య లు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. రూ.276 కోట్ల నిధులు ఆలయ పరిసరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఎటువంటి నాణ్యతా లోపాలు లేకుండా, దశాబ్దాల కాలం పాటు నిర్మాణాలు ప్రతిష్టంగా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. మంత్రి వెంట భద్రా చలం ఐటీడీఏ పీఓ రాహుల్, ఆలయ ఈఓ దామోదర్, తహసీల్దార్ రవి కుమార్ ఉన్నారు.
నర్సు హత్య నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తా
ములకలపల్లి (విజయక్రాంతి): గిరిజన కుటుంబానికి చెందిన నర్సు హత్య కేసు నిందితుడికి చట్ట ప్రకారం కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం ములకలపల్లి మండలంలోని మృతురాలి గ్రామానికి వెళ్లి తల్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటానని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ ఘటనపై సీఎంతో సమావేశమై చర్యలు తీసుకుంటామన్నారు.






