వేతన బకాయిలు చెల్లించాలి

03-10-2026 | 06:04pm

ఎల్‌ఎస్‌ఎన్‌ క్యాంపులో కార్మికుల ఆందోళన

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం(Tekulapalli Mandal) సింగరేణి కోయగూడెం ఓబీ పనులు(Singareni Koyagudem OB works) నిర్వహిస్తున్న ఎల్‌ఎస్‌ఎన్‌ కంపెనీ యాజమాన్యం(LSN Company Management) కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలు, బోనస్‌, ఈపీఎఫ్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కార్మికులు కార్మిక సంఘాల(Workers trade unions) ఆధ్వర్యంలో ఎల్‌ఎస్‌ఎన్‌ క్యాంపు వద్ద ఆందోళన చేపట్టారు. దసరా పండుగ సమీపిస్తున్నా బకాయిలు చెల్లించకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకుడు డి.ప్రసాద్‌ మాట్లాడుతూ.. కార్మికులకు రావాల్సిన వేతనాలు చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు.

ఐఎన్‌టీయూసీ నాయకుడు బానోతు నరేష్‌(INTUC leader Banothu Naresh) మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం, పోలీసు అధికారులు చొరవ తీసుకుని కార్మికుల బకాయిలు ఇప్పించాలని కోరారు. విషయం తెలుసుకున్న బోడు ఎస్‌ఐ తిరుపతి అక్కడికి చేరుకుని కార్మిక సంఘాల నాయకులు, ఎల్‌ఎస్‌ఎన్‌ ప్రతినిధులతో చర్చించారు.

సమస్యను త్వరలో పరిష్కరిస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. అయితే సమస్య పరిష్కారం అయ్యే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ కార్మికులు క్యాంపులోనే బైఠాయించారు. కార్యక్రమంలో కార్మికులు బానోతు శంకర్‌, రఘురాం, శ్రీను, గోపాల్‌, గన్నా, వీరన్న, గోపి, ప్రసాద్‌, మోహన్‌, కటారి బాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు