ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ
విద్యాబోధన, వసతి గృహ నిర్వహణపై ప్రత్యేక పరిశీలన
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాలను(Uppusaka Tribal Ashram School) ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ చందన, భద్రాచలం ఏటీడీఓ రాధ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన స్థాయులు, ఉపాధ్యాయుల బోధనా ప్రణాళికలు, కంప్యూటర్ ల్యాబ్ నిర్వహణ, వసతి గృహంలో పరిశుభ్రతను పరిశీలించారు.
తొలుత ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన స్థాయిని పరీక్షించారు. తాము అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల టైమ్‌టేబుల్, ఉపాధ్యాయుల డైరీలు, కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు, నిరంతరం సాధన చేయిస్తూ మెరుగైన ఫలితాలు సాధించేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.ప్రధానోపాధ్యాయుడు బి. పిచ్చయ్యను పాఠశాలకు సంబంధించిన పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతి గృహాన్ని సందర్శించి స్టోర్ రూమ్ నిర్వహణను పరిశీలించారు.
గది శుభ్రంగా, వస్తువులు క్రమపద్ధతిలో ఉండటంపై వార్డెన్‌ను అభినందించారు. పాఠశాల, వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని, విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన, సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బి. పిచ్చయ్య, సీనియర్ ఉపాధ్యాయులు బి. భీమా, బి. ప్రసాదరావు, బీవీ రాజేష్, జి. భద్రు, జి. రాములు, టీ. విజయ, బి. విజయ, వార్డెన్ బి.రాములుతోపాటు రవి, వెంకట్, ధర్మరాజు, నరసింహరావు, కిషన్, రమేష్, గోవింద్ పాల్గొన్నారు.