రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి
నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు:డీఎస్పీ వెంకన్నబాబు
ఇల్లెందు,(విజయక్రాంతి): రౌడీషీటర్లు ఇకపై ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని ఇల్లెందు డీఎస్పీ(Illendu DSP) వెంకన్నబాబు సూచించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు శనివారం ఇల్లెందు పోలీస్‌స్టేషన్‌లో సబ్ డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ(DSP) మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, బెదిరింపులు, దాడులు, అక్రమ కార్యకలాపాలు, ఇతర నేరాలకు పాల్పడినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలు, ప్రవర్తనపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. గత నేర చరిత్రను పక్కనపెట్టి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవిస్తూ సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐలు సురేష్, సత్యనారాయణ, ఎస్సైలు తిరుపతి, ఉమా, సారంగపాణి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.