భూనిర్వాసితులకు ఉచిత వృత్తి శిక్షణ
సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో కోర్సులపై సమీక్ష
ఇల్లెందు టౌన్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఇల్లెందు ఏరియాలో భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉచిత వృత్తి విద్యా కోర్సులకు(Free vocational courses) ప్రాధాన్యం ఇవ్వాలని సింగరేణి సేవా సమితి (Singareni Seva Samithi) అధ్యక్షురాలు వి. రమ సూచించారు. 2026–27 సంవత్సరానికి నిర్వహించనున్న ఉచిత వృత్తి శిక్షణా కోర్సులపై వైసీఓఏ క్లబ్, 24 ఏరియాలో సేవా సభ్యులు, శిక్షకులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రమ మాట్లాడుతూ భూనిర్వాసితులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి వృత్తి నైపుణ్యాలను పెంపొందించేలా శిక్షణ అందించాలని సూచించారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఫ్యాషన్ డిజైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ డీటీపీ తదితర కోర్సులకు శిక్షకులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి, ఆయా రంగాల్లో ప్రావీణ్యం ఉన్న వారు ఈ నెల 28లోపు జీఎం కార్యాలయంలోని సింగరేణి సేవా సమితి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. కార్యక్రమంలో కోఆర్డినేటింగ్ ఆఫీసర్ జి. సుధాకర్, సేవా సెక్రటరీ ఎల్. సులక్షణ, సభ్యులు, శిక్షకులు పాల్గొన్నారు.