కోర్టు ఇంజంక్షన్ ఉన్నా.. పట్టా మార్పు ఎలా?

08-10-2026 | 05:10am
  1.    1954లో కొనుగోలు.. రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు
  2. అదే భూమిలో ఇల్లు.. మల్లన్న ఆలయం..
  3.     1960లో పొగాకు బేరన్ల నిర్మాణానికి పంచాయతీ అనుమతి
  4.     2018లో కోర్టు వివాదం.. తాత్కాలిక ఇంజంక్షన్ ఉన్నా పట్టా మార్పులపై ప్రశ్నలు
  5. అప్పటి ఎంఆర్‌ఓ ఎలాంటి ఆధారాలతో పట్టా మార్చారు..?
  6. ఇళ్లున్న స్థలానికి వ్యవసాయ పట్టా ఎలా..? 
  7. సమగ్ర విచారణకు డిమాండ్

పినపాక, అక్టోబర్ 7 (విజయక్రాంతి): దుగినేపల్లి గ్రామంలోని(Duginepalli Village) ఓ భూ వ్యవహారం రోజురోజుకూ పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. దశాబ్దాల క్రితమే కొనుగోలు చేసినట్లు కోర్టులో దాఖలైన పత్రాల్లో పేర్కొన్న భూమి.. రెవెన్యూ రికార్డుల్లో(Revenue record) పాత యజమాని పేరు నమోదైనట్లు ఉన్నప్పటికీ, అనంతరం అదే భూమికి సంబంధించి పట్టా మార్పులు ఎలా జరిగాయన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా 2018లోనే ఈ భూమిపై న్యాయస్థానంలో వివాదం ఏర్పడి, పిటిషనర్కు అనుకూలంగా తాత్కాలిక ఇంజంక్షన్ ఉత్తర్వులు(Temporary injunction orders) ఉన్నట్లు కోర్టు పత్రాలు సూచిస్తున్న నేపథ్యంలో.. ఆ తర్వాత చోటుచేసుకున్న రెవెన్యూ రికార్డుల మార్పులపై సమగ్ర విచారణ అవసరమని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

1954లోనే భూమి కొనుగోలు..

భద్రాచలం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కోర్టుకు(Bhadrachalam Sub-Divisional Magistrate Court) సంబంధించిన I.A.No.146/2018, O.S.No.156/2018 పత్రాల్లోని వివరాల ప్రకారం.. కందిమల్ల బుచ్చి లింగయ్య(Kandimalla Buchi Lingayya) దాఖలు చేసిన కేసులో, ఆయన తండ్రి కందిమల్ల మాణిక్యం 1954లో సుంకర మునెయ్య నుంచి సదరు భూమిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కొనుగోలు అనంతరం కందిమల్ల మాణిక్యం పేరు రెవెన్యూ రికార్డుల్లో స్వాధీనం/అనుభవదారు కాలమ్లో నమోదైనట్లు కూడా కోర్టు పత్రంలో ప్రస్తావన ఉంది. 

వారి ఇల్లులు.. మల్లన్న ఆలయం కూడా ఉంది..

భూమిని కొనుగోలు చేసిన అనంతరం కందిమల్ల మాణిక్యం ఆ స్థలంలో నివాసం ఏర్పరచుకున్నట్లు కోర్టు పిటిషన్లో వివరాలు ఉన్నాయి. హెచ్.నెం.1-6తో ఇల్లు నిర్మించుకోవడంతో పాటు అదే స్థలంలో మల్లన్న స్వామి ఆలయం, పశువుల కొట్టం ఉన్నట్లు పత్రాల్లో పేర్కొన్నారు.

1960లో పొగాకు బేరన్లకు పంచాయతీ అనుమతి..

1960లో కందిమల్ల మాణిక్యం దుగినేపల్లి గ్రామ సర్పంచ్కు దరఖాస్తు చేయగా, రెండు పొగాకు బేరన్లు నిర్మించేందుకు గ్రామపంచాయతీ అనుమతి ఇచ్చినట్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. దీంతో ఆ భూమి వినియోగానికి సంబంధించిన పాత చరిత్రను రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.

2018లో కోర్టు వివాదం.. ఇంజంక్షన్ ఉత్తర్వులు..

ఈ భూమికి సంబంధించి 2018లో O.S.No. 156/2018 కేసు నమోదైనట్లు కోర్టు పత్రాలు చూపుతున్నాయి. దానికి అనుబంధంగా దాఖలైన I.A.No.146/ 2018లో పిటిషనర్ అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం తాత్కాలిక ఇంజంక్షన్ మంజూరు చేసినట్లు పత్రాల్లో ఉంది. దీంతో న్యాయస్థానం పరిధిలో ఉన్న భూమికి సంబంధించి అనంతర కాలంలో రెవెన్యూ రికార్డుల్లో మార్పులు జరిగి ఉంటే.. ఆ సమయంలో కోర్టు ఉత్తర్వులను అధికారులు పరిశీలించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అప్పటి ఎంఆర్‌ఓ ఎలాంటి ఆధారాలతో పట్టా మార్చారు..?

ఈ వ్యవహారంలో అప్పట్లో విధులు నిర్వహించిన మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) పాత్రపైనా స్పష్టత అవసరమని స్థానికులు కోరుతున్నారు. పాత రికార్డుల్లో ఒకరి పేరు కొనసాగుతున్న భూమికి అనంతరం పట్టా మార్పు జరిగితే.. ఆ మార్పుకు దరఖాస్తు ఎవరు చేశారు? ఏ పత్రాలను ఆధా రంగా సమర్పించారు? పాత రెవెన్యూ రికార్డులను పరిశీలించారా? భూమి వాస్తవ పరిస్థితిపై క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారా? కోర్టులో వివాదం ఉన్న విషయం అధికారుల దృష్టికి వచ్చిందా? అన్న అంశాలు తేలాల్సి ఉంది.

పట్టా మార్పునకు సంబంధించి అప్పటి ఎంఆర్‌ఓ  ఏ ఉత్తర్వులు జారీ చేశారు?

ఆ ఉత్తర్వులకు సంబంధించిన ఫైల్ నోట్, విచారణ నివేదిక, నోటీసులు, సంబంధిత పత్రాలు ప్రస్తుతం రెవెన్యూ కార్యాలయంలో ఉన్నాయా? అన్నదీ అధికారులు వెల్లడించాలని పిటిషణర్ కోరుతున్నారు. కేవలం రికార్డుల్లో పేరు మారినంత మాత్రాన ఆ మార్పు వెనుక ఉన్న పూర్తి ప్రక్రియ స్పష్టమయ్యేది కాదని, సంబంధిత ఫైళ్లను బయటకు తీసి పరిశీలిస్తేనే వాస్తవాలు తేలుతాయని ఆయన అంటున్నారు.

ఇళ్లున్న స్థలానికి వ్యవసాయ పట్టా ఎలా..?

ప్రస్తుతం ఆ భూమిలో ఇళ్లు, ఇతర నిర్మాణాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి స్థలాన్ని ఏ ప్రాతిపదికన వ్యవసాయ భూమిగా పరిగణించారు? పట్టా మార్పు సమయంలో క్షేత్రస్థాయి పరిశీలన జరిగిందా? భూమి వాస్తవ వినియోగాన్ని అధికారులు నమోదు చేశారా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలని వారు కోరుతున్నారు.

పాత పట్టాదారులు.. కొత్త పేర్ల మధ్య సంబంధం ఏమిటి?

పాత యజమానుల పేర్లు, అనంతరం రికార్డుల్లో నమోదైన వ్యక్తుల పేర్లలో ఒకే ఇంటిపేరు కనిపిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే కేవలం ఇంటిపేరు ఒకటిగా ఉన్నంత మాత్రాన కుటుంబ లేదా వారసత్వ సంబంధం నిర్ధారణ కాదని వారు అంటున్నారు. పాత యజమానులకు, ప్రస్తుత పట్టాదారులకు నిజంగా వారసత్వ సంబంధం ఉందా? ఉంటే దానికి సంబంధించిన వారసత్వ పత్రాలు, కుటుంబ వివరాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఏమిటి? అన్నది అధికారికంగా తేల్చాల్సి ఉంది.

సర్వే నంబరుపైనా స్పష్టత అవసరం..

ఈ భూమికి సంబంధించి సర్వే నంబర్ విషయంలోనూ స్పష్టత అవసరమని స్థానికులు చెబుతున్నారు. రికార్డుల్లో ఏదైనా మార్పు లేదా తప్పిదం జరిగిందా? అన్నది సంబంధిత రెవెన్యూ రికార్డులను పరిశీలించి అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. పట్టా మార్పు ఫైళ్లు బయటపెట్టాలి.. పట్టా మార్పు కోసం సమర్పించిన దరఖాస్తు, దానికి జత చేసిన ఆధారాలు, అప్పటి ఎమ్మార్వో చేసిన విచారణ, సంబంధిత అధికారుల నివేదికలు, జారీ చేసిన ఉత్తర్వులు, పాత రెవెన్యూ రికార్డులు అన్నింటినీ పరిశీలించాలని బాధ్యులు కోరుతున్నారు. ముఖ్యంగా కోర్టు వివాదం కొనసాగుతున్న సమయంలో లేదా అనంతరం పట్టా మార్పు జరిగి ఉంటే.. న్యాయస్థానం ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్నారా? అనే అంశాన్ని కూడా విచారణలో భాగంగా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. 

రికార్డులు పరిశీలించి వాస్తవాలు తేల్చాలి..

1954 నాటి కొనుగోలు పత్రం నుంచి ప్రస్తుత రెవెన్యూ రికార్డుల వరకు, పాత పట్టా/అనుభవదారు వివరాలు, 1960లో పంచాయతీ ఇచ్చిన అనుమతి, భూమి వర్గీకరణ, 2018 కోర్టు కేసు, తాత్కాలిక ఇంజంక్షన్ ఉత్తర్వులు, అనంతరం జరిగిన పట్టా మార్పులకు సంబంధించిన ఫైళ్లను సమగ్రంగా పరిశీలించాలని  బాధ్యులు  కోరుతున్నారు.

ఎలాంటి విచారణ జరిగింది? 

పాత రికార్డులను పరిశీలించారా?

ఆ సమయంలో ఎలాంటి విచారణ జరిగింది? పాత రికార్డులను పరిశీలించారా? కోర్టు కేసు వివరాలు తెలుసా? అన్న ప్రశ్నలకు అధికారిక రికార్డుల ఆధారంగా సమాధానం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పాత రికార్డుల నుంచి ప్రస్తుత పట్టాల వరకు సమగ్ర విచారణ చేపట్టి, పట్టా మార్పు ప్రక్రియలో నిబంధనలు పాటించారా లేదా అన్నది తేల్చాలని సంబంధించిన బాధ్యతలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు