శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ వెంకన్న బాబు
ఇల్లెందు,(విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు సూచించారు. గురువారం ఇల్లందు పోలీస్‌స్టేషన్‌లో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో నిర్వహించిన శాంతిభద్రతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మండపానికి పోలీసుల అనుమతి తప్పనిసరని, విద్యుత్ లైటింగ్‌కు సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత డీజేలు, అధిక శబ్దంతో లౌడ్‌స్పీకర్లకు అనుమతి లేదన్నారు.
మత సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరించినా, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాలంటీర్లను నియమించుకోవాలని సూచించారు. నిమజ్జన శోభాయాత్రను పోలీసులు సూచించిన మార్గంలోనే నిర్వహించాలని, మద్యం సేవించి గొడవలకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించాలని కోరారు.