రామవరం భూ రీ-సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ అంకిత్
రీ-సర్వే పనులను నెలన్నరలో పూర్తి చేయాలి..
రికార్డుల ఆధారంగా హద్దులను నిర్ధారించాలి..
కొత్తగూడెం సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కొత్తగూడెం మండలం రామవరం రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను, జిల్లా కలెక్టర్ అంకిత్(District Collector Ankit) మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుజాతనగర్–రామవరం–గరీబ్ పేట ట్రైజంక్షన్ వద్ద జరుగుతున్న సర్వే పనులను పరిశీలించి, సర్వే పురోగతి, భూ హద్దుల నిర్ధారణ, సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రామవరం రెవెన్యూ పరిధిలో సుమారు 1,950 ఎకరాల భూమికి రీ-సర్వే నిర్వహించాల్సి ఉందని సుమారు 146 ఎకరాల మేర అటవీ భూమి ఉన్నట్లు అధికారులకు వివరించారు. సర్వే నంబర్లు 23, 30, 31 తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. సర్వే నంబర్ 20లో పట్టా, అసైన్మెంట్, అటవీ భూములు కలిసి ఉన్నందున, హద్దులను రికార్డుల ఆధారంగా స్పష్టంగా నిర్ధారించాలని సూచించారు. అర్హులైన వారికి ఆర్ ఓ ఎఫ్ ఆర్ కింద హక్కులు కల్పించినట్లు అధికారులు వివరించారు.
సుమారు 420 మందికి పైగా పట్టాదారులు ఉన్నారని, ఇందులో గిరిజనులు, గిరిజనేతరులు ఉన్నట్లు తెలిపారు. రీ-సర్వే ద్వారా భూ హద్దులు, స్పష్టమై, రికార్డులను పక్కాగా రూపొందించాలని కలెక్టర్ సూచించారు. సమ్మక్క గద్దె సమీప ప్రాంతం నుంచి సుమారు 2.3 నుంచి 2.5 కిలోమీటర్ల పాత సరిహద్దు రాళ్లు, మ్యాప్లు, రికార్డులను పరిశీలించి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు. రీ-సర్వే పనులను నెలన్నరలోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ పుల్లయ్య, సర్వేయర్ అశోక్, ఆర్ఐ గణపతి, లైసెన్సుడ్ సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది, అటవీశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.