మత సామరస్యానికి రామాయంపేట వేదికైంది..

22-09-2026 | 07:47pm

రామాయంపేట సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రామాయంపేట పట్టణంలోని అయ్యప్ప దేవాలయ(Ayyappa Temple) ప్రాంగణంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం ప్రత్యేక అభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించడం ఆనవాయితీ. కుజ దోష నివారణ, కోరికలు నెరవేరాలని భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పూజలో పాల్గొంటారు. ఈ మంగళవారం నిర్వహించిన ప్రత్యేక అభిషేకంలో నార్సింగి గ్రామానికి చెందిన ముస్లిం మహిళ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

స్వామి వారికి పాలాభిషేకం చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. మతాలు వేరైనా దేవుడు ఒక్కడేనని, తన కుటుంబ సమస్యలు తొలగిపోవాలని స్వామి వారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ముస్లిం మహిళ హిందూ ఆలయంలో పూజ చేయడం చూసిన భక్తులు మత సామరస్యానికి ఇది నిదర్శనమని కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన రామాయంపేటలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు