మురికి కాలువలోకి దూసుకెళ్లిన బైక్‌

09-10-2026 | 04:28pm

మైనారిటీ కాలేజీ సమీపంలో ఘటన.. స్వల్ప గాయాలతో బయటపడ్డ కుటుంబం

బూర్గంపాడు,(విజయక్రాంతి): సారపాకలో ద్విచక్ర వాహనం(Two-wheeler) అదుపుతప్పి మురికి కాలువలోకి(Sewage drain) దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనంపై ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. రెడ్డిపాలెం(Reddipalem) నుంచి ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి వ్యక్తిగత పనులపై బైక్‌పై సారపాక మసీదు రోడ్డు వైపు వెళ్తుండగా, మైనారిటీ కాలేజీ సమీపంలో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయింది. దీంతో వాహనంపై ఉన్నవారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే స్వల్ప గాయాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

రక్షణ చర్యలు కరువు!

కాలువల పక్కన రక్షణ గోడలు, బారికేడ్లు లేకపోవడం ప్రమాదాలకు(Accidents) కారణమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న కాలువల వద్ద రక్షణ ఏర్పాట్లు చేయడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు