ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు కృతజ్ఞతలు
ముదిరాజుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు కృతజ్ఞతలు
ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేయడం గర్వకారణం: బరిగె శ్రీనివాస్ ముదిరాజ్
ఆలేరు, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ముదిరాజ్ కులస్తుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు(MLA Beerla Ilaiah), కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆలేరు టౌన్ మత్స్యశాఖ అధ్యక్షుడు బరిగె శ్రీనివాస్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ముదిరాజ్ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు.
పండుగ సాయన్న(Panduga Sayanna) తెలంగాణ చరిత్రలో ప్రజా నాయకుడిగా, దానధర్మాలు చేసిన వ్యక్తిగా, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా సుపరిచితుడని బరిగె శ్రీనివాస్ ముదిరాజ్ పేర్కొన్నారు. సుమారు 1860 నుంచి 1900 మధ్య జీవించిన సాయన్న, ఆనాటి నిజాం పాలనలోని నిరంకుశ అధికారులను ప్రశ్నిస్తూ, వారి ఆధిపత్యాన్ని ఎదిరించారని తెలిపారు. తనదైన పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ సరికొత్త బహుజన రాజ్య స్థాపనకు ప్రయత్నించారని వివరించారు. ఆధిపత్య శక్తులైన దేశ్‌ముఖ్‌లు, కరణాలు, పటేళ్లు, భూస్వాముల కుట్రల కారణంగా ఆనాటి నిజాం ప్రభుత్వం చేతిలో పండుగ సాయన్న ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడిన పండుగ సాయన్న చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా ఆయన పోరాట స్ఫూర్తికి తగిన గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ముదిరాజ్ కులస్తులు వివిధ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురయ్యారని, తమ సామాజిక వర్గ అభివృద్ధికి తగిన ప్రాధాన్యత లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం, ముదిరాజ్ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మారుస్తామని హామీ ఇవ్వడం ఆశాజనకమన్నారు. ముదిరాజ్ కులస్తుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. రానున్న ప్రతి ఎన్నికల్లో ముదిరాజ్ సమాజం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి, ఘన విజయం సాధించేలా కృషి చేయాలని బరిగె శ్రీనివాస్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.