రెండు నెలలుగా వాటర్ లీకేజీ
- మున్సిపల్ అధికారులకు పట్టదా?
- ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందనేది?
- నీటి వృథాను అరికట్టి సమస్యను వెంటనే పరిష్కరించాలి
ఇల్లెందు టౌన్, విజయక్రాంతి: ఇల్లెందు మున్సిపాలిటీ(Yellandu Municipality) పరిధిలోని 15వ వార్డు సాహితి కాలేజీకి వెళ్లే మార్గంలో వాటర్ పంపు గత రెండు నెలలుగా లీకవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై తెలుగుదేశం పార్టీ ఇల్లెందు నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ వంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన తాగునీటిని పొదుపుగా వినియోగించాల్సిన సమయంలో, వాటర్ పంపు నుంచి నీరు వృథాగా పోతున్నా అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఈ సమస్యపై స్థానికులు పలుమార్లు మున్సిపల్ కార్యాలయానికి(Municipal office) వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం చూపకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం ప్రజల ఇబ్బందులను పట్టించుకోకపోవడమేనన్నారు. ఒక చిన్న లీకేజీని సరిచేయడానికి కూడా నెలల సమయం పడితే ప్రజలకు మున్సిపల్ పాలనపై నమ్మకం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందించకపోవడం సరైన పద్ధతి కాదని ముద్రగడ వంశీ అన్నారు. రెండు నెలలుగా కొనసాగుతున్న లీకేజీ కారణంగా విలువైన నీరు వృథా అవుతున్నా సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారని నిలదీశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి 15వ వార్డులో సాహితి కాలేజీకి వెళ్లే మార్గంలోని వాటర్ పంపు లీకేజీని తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించి నీటి వృథాను నివారించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముద్రగడ వంశీ కోరారు. ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించకపోవడంపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.