కాంగ్రెస్ నిరసన

28-09-2026 | 01:49pm

సీఇసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: 

ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య..

ఆలేరు, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఓటర్ల జాబితా, ఓట్ల తొలగింపు అంశాలపై కాంగ్రెస్ పార్టీ(Congress protests) ఆధ్వర్యంలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ భాస్కర్ రావుకు వినతిపత్రం అందజేశారు.

ఓటు హక్కును కాపాడాలి, ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య(beerla ilaiah) మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘానికి కీలక బాధ్యత ఉందన్నారు. ప్రతి ఓటరుకు తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓట్ల తొలగింపుపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలపై ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని అన్నారు.

13 కోట్ల ఓట్ల తొలగింపు జరిగిందని ఆరోపణ

దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు, తెలంగాణలో 72 లక్షల ఓట్లు తొలగించారని బీర్ల అయిలయ్య ఆరోపించారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఓట్లనే తొలగించారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఇసీ రాజీనామాకు డిమాండ్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని బీర్ల అయిలయ్య తెలిపారు. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ జ్ఞానేష్ కుమార్ రాజీనామా(Gyanesh Kumar resigns) చేయాలని ఏఐసీసీ, టీపీసీసీ డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐతో పాటు ఇతర అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు