చీపురు పట్టే చేతులే.. కట్టు కడుతున్నాయ్

28-09-2026 | 02:14pm

పాపన్నపేట పీహెచ్సీలో వైద్య చికిత్సల తీరు 

సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారంటున్న రోగులు 

విధుల్లో నిర్లక్ష్యం.. ఉన్నతాధికారులతో చెలిమి 

పాపన్నపేట,సెప్టెంబర్28: 'వైద్యో నారాయణో హరి' అన్ననుడి ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రుల్లో(government hospitals) అందుతున్న వైద్య సేవలు అందుకు భిన్నంగా ఉన్నాయి. చీపురు పట్టుకొని పరిసరాలను శుభ్రం చేసే వ్యక్తి తన పనిని పక్కనపెట్టి రోగులకు చికిత్స చేయాల్సిన పరిస్థితి పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొంది. విజయక్రాంతి దినపత్రిక రిపోర్టర్ మీరెందుకు కట్టు కడుతున్నారని అడగగా.. ప్రతిరోజు నేనే కడతానని.. డాక్టర్, నర్సులు డ్రెస్సింగ్ చేసి నన్నే కట్టు కట్టమంటారని సమాధానం ఇచ్చారు. సోమవారం ఈ ఆసుపత్రిని విజయక్రాంతి దినపత్రిక రిపోర్టర్ పరిశీలించినప్పుడు ఈ తతంగమంతా కనిపించింది.

గత కొన్ని ఏళ్లుగా కంటిజెన్సీ వర్కర్ గా ఇదే ఆస్పత్రిలో అమృత పనిచేస్తుంది. చీపురు పట్టి పరిసరాలు శుభ్రం చేయాల్సిన ఆమె రోగులకు, వైద్య సిబ్బందికి సేవలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అడిగే వారు లేరనే ఉద్దేశంతో వైద్య సిబ్బంది ఉన్నా కాలు కదపరు. వారి విధులను కూడా అమృతకే చేయమంటారు. ఉన్నతాధికారులు వైద్య సిబ్బందితో చెలిమిగా ఉండడంతో వారికి ఉన్నతాధికారులు అంటే భయం లేకుండా పోయింది. 24 గంటల సేవలు అందించే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు మండిపడుతున్నారు. ఈ పరిస్థితిపై సిబ్బందిని విజయక్రాంతి వివరణ అడగగా.. సంబంధం లేని సమాధానాలు ఇస్తున్నారు.

 ఆసుపత్రిలో అందుబాటులో లేని డాక్టర్

 మిన్పూర్ గ్రామానికి చెందిన శ్రీశైలం కాలుకు గాయం అవడంతో పిహెచ్సి కి చికిత్స నిమిత్తం వచ్చాడు. కాలు నొప్పిగా ఉందని వైద్యం అందించమని సిబ్బందిని కోరగా.. సూదులు నిలువ లేవని, బయట మెడికల్ దుకాణం నుంచి కొనుగోలు చేసుకోమని దురుసుగా ప్రవర్తిస్తున్నారని వాపోయాడు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారిని సంప్రదించగా.. సూదులు స్టాక్ ఉన్నాయని సమాధానమిచ్చారు. ఆసుపత్రి డాక్టర్ ను ఫోనులో సంప్రదించగా అందుబాటులోకి రాలేడు.

మరిన్ని వార్తలు