ప్రజాప్రభుత్వంలో విద్యతో సమానంగా క్రీడలకు ప్రాధాన్యం
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 28 ( విజయ క్రాంతి ) : రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రజాప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రీడా ఉత్సవాలను ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర(MLA Gandra) మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన వారికి ప్రభుత్వం ఉద్యోగాలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తుందని, బొల్లికుంట గ్రామానికి చెందిన ప్రతిభావంతురాలికి ఎక్సైజ్ శాఖలో ఉద్యోగంతో పాటు ఇల్లు కూడా కల్పించడమే అందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.
భూపాలపల్లి క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదిగి, పుట్టిన ఊరికి, చదివిన పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. క్రీడలకు అవసరమైన పరికరాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సీహెచ్ రఘు, సంబంధిత అధికారులు, మున్సిపల్ ఛైర్మెన్ బుర్ర కొమురయ్య, వైస్ ఛైర్మెన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.