అరోరా గర్ల్స్ హాస్టల్ ఫొటోల వ్యవహారంపై పోలీసుల విచారణ
గుర్తు తెలియని నంబర్ నుంచి ఫొటోలు వ్యాప్తి.. అనుమానితుడి మొబైల్ స్వాధీనం
ఆలేరు,(విజయక్రాంతి): భువనగిరి పట్టణ శివారులోని అరోరా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్(Aurora university girls hostel)కు సంబంధించిన ఫొటోలు గుర్తుతెలియని నంబర్ నుంచి వ్యాప్తి చెందినట్లు యూనివర్సిటీ యాజమాన్యం ఫిర్యాదు చేసిందని భువనగిరి రూరల్ సీఐ ఎన్. చంద్రబాబు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు యూనివర్సిటీకి చేరుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, అందులోని వివరాలను పరిశీలన కోసం ల్యాబ్‌కు పంపించామని సీఐ ఎన్. చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ఫొటోలు వ్యాప్తి చెందినట్లు చెబుతున్న గుర్తుతెలియని ఫోన్ నంబర్‌ను కూడా ట్రేస్ చేస్తున్నామని తెలిపారు. రెండు రోజుల పాటు సెలవులు ఉన్నందున, ల్యాబ్ నుంచి నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు.
విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత:
మరోవైపు, విద్యార్థినుల భద్రతపై ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు యూనివర్సిటీ ప్రధాన భవనం ఎదుట ఆందోళనకు దిగారు. లేడీస్ హాస్టల్‌లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ నిర్వహణ సిబ్బందికి, విద్యార్థి సంఘం నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళన సందర్భంగా హాస్టల్ భవనంపై రాళ్లు రువ్వడంతో కొన్ని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.
సమాచారం అందుకున్న భువనగిరి రూరల్ సీఐ ఎన్. చంద్రబాబు పోలీసు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. హాస్టల్‌లో విద్యార్థినులకు పూర్తి భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఫొటోల వ్యవహారంపై ల్యాబ్ నివేదిక, పోలీసుల తదుపరి విచారణలో వెల్లడయ్యే వివరాలపై ఆసక్తి నెలకొంది.