జూరాల నీటి విడుదలపై ప్రభుత్వం కసరత్తు

22-09-2026 | 03:23pm

పంటలకు దశలవారీగా నీటిని విడుదల చేసే యోచన.. కర్ణాటక సీఎంతో చర్చకు సిద్ధం

వనపర్తి,సెప్టెంబర్‌ 22 ( విజయక్రాంతి ) :  జూరాల ప్రాజెక్టు(Jurala Project) నుంచి సాగునీటి విడుదలపై ప్రభుత్వం సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. పంటలకు నష్టం కలగకుండా, రైతులు ఇబ్బందులు పడకుండా దశలవారీగా నీటిని విడుదల చేసే అంశంపై ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో(Chief Minister Revanth Reddy) పాటు ఇరిగేషన్‌ శాఖ మంత్రులతో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జి. మధుసూదన్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి సమావేశమై చర్చించినట్లు తెలిసింది.

జూరాలకు ఎగువ నుంచి మరింత నీరు వచ్చేలా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో మాట్లాడి నీటిని విడుదల చేయాలని కోరే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను తాగునీటి అవసరాలకు కాపాడుతూనే సాగునీటి అవసరాలను తీర్చేలా సమన్వయంతో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న నీటి ఎద్దడి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొడుతున్నాయని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సాగు, తాగునీటి అవసరాలను సమతుల్యం చేస్తూ రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.

మరిన్ని వార్తలు