6 September, 2026 | 4:35 PM

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై టిఆర్ఎస్ పార్టీ నిరసనల హోరు

06-09-2026 | 03:20pm

చీపుర్లతో పారిశుధ్యం పనులు

ఖాళీ బిందెలతో నిరసన

ఆటో నడిపిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు, సెప్టెంబర్ 6, (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై వికారాబాద్ జిల్లా తాండూరు(Tandur)లో భారత రాష్ట్ర సమితి నాయకులు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి(Pilot Rohit Reddy) ఆధ్వర్యంలో ఆదివారం నిరసనల హోరు సాగింది. తెల్లవారుజామున విలేమున్ హైస్కూల్ గ్రౌండ్‌లో జాగింగ్, వాకింగ్ చేసే వారితో కలిసి వాకింగ్ చేశారు. యువకులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును వివరించారు. అనంతరం స్థానిక బసవన్న కట్ట సమీపంలో మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి చీపుర్లతో పారిశుధ్య పనులు నిర్వహించారు. శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం కూడలి వద్ద మహిళలతో కలిసి త్రాగునీటి సమస్యలపై ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. శాంతి మహల్ చౌరస్తా వద్ద నుండి గులాబీ జెండాలతో ఆటో ర్యాలీ నిర్వహించారు. స్వయంగా పైలెట్ రోహిత్ రెడ్డి ఆటో నడిపి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతో దినమంతా నిరసనల పోరు కొనసాగింది.

ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి(Pilot Rohit Reddy) మాట్లాడుతూ వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని విమర్శించారు. తాండూర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా త్రాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలు తీరేవరకు వారికి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున తాను అండగా ఉంటానని.. ఎవరు కూడా అధైర్యపడకూడదని తెలిపారు. ప్రజలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, వివిధ రంగాల వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు తీరాలంటే తాండూరు గడ్డపై గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్‌ను మరోమారు ముఖ్యమంత్రి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దీపా నర్సింహులు, కౌన్సిలర్లు ఇర్షాద్, మహేశ్వరి, బీఆర్‌ఎస్‌వీ నాయకులు దత్తాత్రేయ రావు, సీనియర్ నాయకులు బషారత్, రుద్ర పాటిల్, అడికిచెర్ల జనార్దన్ రెడ్డి, కోట్రీక శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ రాఘవేందర్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానికులు భారీగా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు