లిఫ్ట్ సర్వేలో మాయ.!
- వృద్ధ రైతు దంపతుల భూమికి పరిహారం ఏదీ.?
- 33 కుంటలు ప్రాజెక్టు పరిధిలోకి.. నష్టపరిహారంపై స్పష్టత లేదంటున్న బాధితులు
- మాయమాటలతో అగ్రిమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపణ
- అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. అధికారుల తీరుపై ఆవేదన
- సర్వే నుంచి పరిహారం లెక్కల వరకు పూర్తిస్థాయి విచారణకు డిమాండ్
మోతె, సెప్టెంబర్18 (విజయ క్రాంతి): పంట పొలాలకు నీరందించేందుకు చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Lift Irrigation Project).. తమకు మాత్రం కన్నీళ్లు మిగుల్చుతోందని ఓ వృద్ధ రైతు దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైప్లైన్(Pipeline) కోసం తమ భూమిని తీసుకుంటున్నా.. భూమి విస్తీర్ణం, విలువకు తగ్గట్టుగా నష్టపరిహారం అందడం లేదని ఆరోపిస్తున్నారు.
సర్వే సమయంలో అసలు పరిహారం ఎంత వస్తుందో చెప్పకుండా వివిధ రకాలుగా నచ్చజెప్పి అగ్రిమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని వాపోతున్నారు. బురకచర్లలో వెలుగుచూసిన ఈ వ్యవహారం ఇప్పుడు అధికారుల తీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
33 కుంటలు ప్రాజెక్టు పరిధిలోకి..
మోతె మండలాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. సిరికొండ రెవెన్యూ పరిధిలోని బురకచర్లలో పైప్లైన్ కోసం పలువురు రైతుల భూములు ప్రాజెక్టు పరిధిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. రైతు బండారు సంజీవరెడ్డికి చెందిన సర్వే నంబర్ 192లో 17 కుంటలు, 194, 195, 196 సర్వే నంబర్లలో మరో 16 కుంటలు.. మొత్తం 33 కుంటల భూమి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చినట్లు బాధితులు చెబుతున్నారు.
పరిహారం చెప్పకుండానే సంతకాలు.?
సర్వే సందర్భంగా జీపీఓలు తమకు మాయమాటలు చెప్పి, భూమికి ఎంత పరిహారం వస్తుందో స్పష్టంగా వివరించకుండానే అగ్రిమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. అనంతరం నష్టపరిహారం వివరాలు అడిగినా సరైన సమాచారం ఇవ్వడం లేదని వాపోతున్నారు.
ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో
తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినప్పుడు సంబంధిత వ్యక్తులు బెదిరింపు ధోరణిలో మాట్లాడారని దంపతులు ఆరోపిస్తున్నారు.ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో ఏం చేసుకుంటావో చేసుకో అంటూ సమాధానం ఇచ్చారని పేర్కొంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రికార్డులు పరిశీలించాలి
ప్రజాప్రయోజన ప్రాజెక్టులో రైతులకు అన్యాయం జరగకుండా అధికారులు జోక్యం చేసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. బాధితుల భూముల రికార్డులు, సర్వే వివరాలు, అగ్రిమెంట్లు, నష్టపరిహారం లెక్కలను సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. భూమి విలువకు, చట్ట నిబంధనలకు అనుగుణంగా నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
లిఫ్ట్ ఇరిగేషన్ కు భూములు ఇచ్చిన ప్రతి రైతు కు అందవలసిన నష్టపరిహారం గెజిట్ పబ్లికేషన్ లో ఉన్న భూమికి ఆర్డీవో అధికరణతో లిఫ్ట్ ఇరిగేషన్ కి భూమి ఇచ్చిన ప్రతి రైతుకు పూర్తిస్థాయి నష్టపరిహారం అందే విధంగా చూస్తాం..
మోతె తాసిల్దార్ వెంకన్న