గ్రంధాలయాలను ప్రారంభించి నిరుద్యోగ యువత ఇబ్బందులు తొలగించండి
మంత్రి ఉత్తమ్ కు విజ్ఞప్తి
రాపోలు నవీన్ కుమార్
నేరేడుచర్ల,సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): విజ్ఞాన భాండారాలైన, ఆధునిక దేవాలయాలుగా ప్రసిద్ధిగాంచిన గ్రంథాలయాల నిర్మాణం పూర్తయి చాన్నాళ్లు అయినందున హుజూర్ నగర్, నేరేడుచర్లలో తక్షణమే మంత్రి ఉత్తమ్(Minister Uttam Kumar Reddy) వాటిని ప్రారంభించి నిరుద్యోగ యువతకు అందుబాటులోకి తేవాలని బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్ కోరారు.
గురువారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ ముందు బిఆర్ఎస్, నిరుద్యోగ యువతతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రంథాలయాలు కేవలం పుస్తకాలు ఉండే గదులు కావు అని అవి జ్ఞానానికి నిలయాలు, యువత భవిష్యత్తుకు బాటలు వేసే కేంద్రాలు.
పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఖరీదైన పుస్తకాలు, కోచింగ్ సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా, గ్రంథాలయాలు వారికి ఎంతో ఉపయోగపడతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు పుస్తకాలు, పత్రికలు, ప్రశాంతమైన చదువు వాతావరణం అవసరం అలాంటి జ్ఞాన భాండాగారాలు మూసి ఉంటే నష్టపోయేది ఒక భవనం కాదు చదువుకునే అవకాశం, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత సమయం, వారి భవిష్యత్తు అని వెనువెంటనే వాటిని ప్రారంభించాలి అని డిమాండ్ చేశారు.