ప్రజల ఓట్లు కావాలి.. కానీ ప్రజల రోడ్ల సమస్యలు పట్టవా?

24-10-2026 | 03:01pm

రోడ్ల పనులు ప్రారంభించకపోతే ఎమ్మెల్యే పర్యటనలను అడ్డుకుంటాం. 

కోదాడ శాసన సభ్యురాలు ఉత్తం పద్మావతి రెడ్డికి 

బహిరంగ లేఖ విడుదల చేసిన సీపీఐ(ఎం) నేత మట్టిపెల్లి సైదులు 

మోతె,(విజయక్రాంతి): ప్రజల సమస్యలు పరిష్కరించలేని ప్రజాప్రతినిధులు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇవ్వాలి? ఇంకెన్నిసార్లు అధికారుల చుట్టూ తిరగాలి? ప్రజల అవసరాలు కనిపించవా? ప్రజల ఇబ్బందులు వినిపించవా? మోతె మండలం(Mothe mandal) రాఘవాపురం నుంచి మునగాల మండలం సీతానగారం, రేపాల గ్రామాలకు లింకు రోడ్డు నిర్మించాలని, అదేవిధంగా మామిల్లగూడెం నుండి నరసింహపురం వరకు, దుబ్బతండ నుంచి నరసింహపురం వరకు రోడ్లు వేయాలని కోరుతున్నా స్పందన లేకపోవడంపై సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మట్టిపెల్లి సైదులు(CPI(M) leader Mattipelli Saidulu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు శనివారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి(MLA Uttam Padmavathi Reddy)కి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఎన్నికల సమయంలో ప్రజలు గుర్తుకొస్తారు.. ఓట్లు కావాల్సినప్పుడు గ్రామాలు గుర్తుకొస్తాయి.. కానీ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన సమయానికి మాత్రం ఎందుకు స్పందించడం లేదు? అని సైదులు ప్రశ్నించారు. రాఘవాపురం నుంచి సీతానగారం, రేపాల, మామిల్లగూడెం నుండి నరసింహపురం వరకు, దుబ్బతండ నుండి నరసింహపురం గ్రామాల వరకు రోడ్ల నిర్మాణం కోసం  ప్రస్తుత ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా, వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడం ప్రజలను నిరాశకు గురిచేస్తోందన్నారు.

ఈ మార్గంలో ప్రతిరోజూ వందలాది మంది మోటార్‌సైకిళ్లపై వ్యాపార, వ్యవసాయ ఇతర అవసరాల కోసం ప్రయాణిస్తున్నారని తెలిపారు. గ్రామాల మధ్య రహదారి సౌకర్యం కల్పించాలనే ప్రజల న్యాయమైన డిమాండ్‌ల ను ఇంతకాలం నిర్లక్ష్యం చేయడానికి కారణమేంటని ప్రశ్నించారు. ప్రజలకు కనీస రవాణా సౌకర్యం కల్పించలేని పాలకులు అభివృద్ధి గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు.

ఇది ఎవరి వ్యక్తిగత సమస్య కాదు.. వందలాది మంది ప్రజల నిత్యజీవితానికి సంబంధించిన సమస్య. ఇది ఎవరికో ఒకరికి చేసే ఉపకారం కాదు.. ప్రజలకు కల్పించాల్సిన కనీస మౌలిక సదుపాయం. ప్రజలు పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నా స్పందించకపోవడం ప్రజల పట్ల నిర్లక్ష్యమేనని విమర్శించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఈ సమస్యపై స్పష్టమైన హామీ ఇవ్వడమే కాకుండా, రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజల సహనాన్ని పరీక్షించవద్దు!

ఇకపై హామీలతోనో, మాటలతోనో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను సహించేది లేదని సైదులు హెచ్చరించారు. రాఘవాపురం–సీతానగారం–రేపాల రోడ్డు, మామిల్లగూడెం నుండి నర్సింహాపురం వరకు, దుబ్బతండ నుండి నరసింహపురం వరకు రోడ్ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి. లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఎమ్మెల్యే పర్యటనలను అడ్డుకుని ప్రజల నిరసనను తెలియజేస్తాం.

రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు పోరాటాన్ని విరమించబోమని ప్రకటించారు.ప్రజల ఓట్లతో పదవులు చేపట్టిన ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజల అవసరాలను నిర్లక్ష్యం చేస్తే ప్రజాక్షేత్రంలోనే నిలదీస్తామని స్పష్టం చేశారు. తక్షణమే  రోడ్లు మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మట్టిపెల్లి సైదులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు