జిల్లాలో యువతకు ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రాధాన్యం

24-10-2026 | 02:52pm

జిల్లా వారసత్వ సంపద పరిరక్షణకు కృషి చేయాలి

అక్టోబర్ 31న అగ్నివీర్, ఎస్‌ఎస్‌సీ జీడీ అభ్యర్థులకు ఉచిత వైద్య శిబిరం

నవంబర్ 1న సీతమ్మలోద్ది ట్రెక్కింగ్‌.. ఇప్పటికే 250 మంది నమోదు

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): యువతకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ, జిల్లాలోని చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Koya Sri Harsha) సూచించారు. యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, సైన్యం, పారామిలిటరీ దళాల్లో ఉద్యోగాలు సాధించాలనుకునే అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని పేర్కొన్నారు.

శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌లో అగ్నివీర్, ఎస్‌ఎస్‌సీ జీడీ అభ్యర్థుల కోసం నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరం, ‘మన జిల్లా–మన ఖిల్లా’ కార్యక్రమం(‘Mana Zilla–Mana Khilla’ programme)లో భాగంగా చేపట్టనున్న సీతమ్మలోద్ది ట్రెక్కింగ్‌కు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.

అభ్యర్థులకు ఉచిత వైద్య శిబిరం

సైన్యంలో ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న యువతకు సహాయపడేందుకు యువశక్తి–పెద్దపల్లి ఆధ్వర్యంలో అక్టోబర్ 31న ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. నవంబర్ 12 నుంచి ప్రారంభం కానున్న ఆర్మీ నియామక ర్యాలీకి హాజరయ్యే అగ్నివీర్ అభ్యర్థులతో పాటు ఎస్‌ఎస్‌సీ జీడీ అభ్యర్థులకు ఈ శిబిరం ఉపయోగపడనుంది.

శారీరక పరీక్షల అనంతరం నిర్వహించే వైద్య పరీక్షల్లో చిన్నపాటి ఆరోగ్య సమస్యల కారణంగా అభ్యర్థులు అనర్హులు కాకుండా, ముందుగానే సమస్యలను గుర్తించి అవసరమైన వైద్య సలహాలు, చికిత్స పొందేందుకు ఈ శిబిరం దోహదపడుతుంది. పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. మరిన్ని వివరాలకు 7780543055, 9182691655 నంబర్లను సంప్రదించాలని కోరారు.

సీతమ్మలోద్ది చారిత్రక విశిష్టతను చాటేలా ట్రెక్కింగ్

జిల్లాలోని చారిత్రక, ప్రకృతి ప్రదేశాల విశిష్టతను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు యువతలో శారీరక దృఢత్వం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ‘మన జిల్లా–మన ఖిల్లా’ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 1న సీతమ్మలోద్ది ప్రాంతంలో ట్రెక్కింగ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 250 మంది రన్నర్లు, వాకర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. సీతమ్మలోద్ది ప్రాంతంలో సుమారు వెయ్యి నుంచి 1,200 సంవత్సరాల నాటి ప్రాచీన చిత్రాలు కలిగిన గుహలు, ఆదిమానవుల జీవన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు.

ట్రెక్కింగ్‌లో భాగంగా పిడుగుతొర్ర, భీమన్న దేవాలయం వంటి చారిత్రక, ప్రకృతి ప్రదేశాలను సందర్శించి వాటి విశిష్టతను తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు. జిల్లా చరిత్ర, వారసత్వ సంపదపై యువతకు అవగాహన కల్పించడంతో పాటు, చారిత్రక ప్రదేశాల పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ట్రెక్కింగ్‌లో భాగంగా యువతకు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించనున్నారు. ‘జీవితానికి అవును.. మాదకద్రవ్యాలకు నో’ అనే నినాదంతో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునివ్వనున్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రవీణ్ రెడ్డి, మాజీ సైనికుడు, అంతర్జాతీయ పర్వతారోహకుడు లెంకల మహిపాల్ రెడ్డి, ఫొటోగ్రాఫర్లు రవీందర్ రెడ్డి, శీలం అనిల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు