డిండి లిఫ్ట్ పనులపై పునఃసమీక్ష చేయాల్సిందే

24-10-2026 | 03:09pm

దశాబ్దాల తీవ్ర అన్యాయం చేస్తే ఊరుకోం 

ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి

మహబూబ్ నగర్(విజయక్రాంతి): డిండి లిఫ్ట్ పేరుతో తల్పులపల్లి, పీఆర్‌ఎల్‌ఐ  ఆయకట్టు భూములు, గ్రామాలను ముంచుతూ పనులు కొనసాగించడం తీవ్ర అన్యాయమని ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ  ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో  ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల సాధన చైర్మన్ రాజేందర్ రెడ్డి మాట్లాడారు.

అక్టోబర్ 23, 2026న ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిండి లిఫ్ట్ పనులను కొనసాగించాలని ఇరిగేషన్ శాఖకు సూచించడం రాజ్యాంగానికి, న్యాయానికి  బాధితులైన మహబూబ్‌నగర్ ప్రజలకు తీవ్ర అన్యాయమని, ఇది విషాదకరమని బాధితుల పక్షాన జేఏసీ తీవ్రంగా నిరసిస్తోందన్నారు. 2007లో డిండి లిఫ్ట్ పేరుతో SLBC నీటిని తరలించే విధానం పట్ల అన్యాయం జరుగుతోందని గ్రహించి, ఆ నీటిని మహబూబ్‌నగర్ భూములు ముంచకుండా నేరుగా దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు తరలించవచ్చని ప్రజాప్రతినిధులు, రైతాంగం, ప్రజాస్వామిక వాదులు పోరాడారని గుర్తుచేశారు.​

డిండి లిఫ్ట్ పనులను వెంటనే పునఃసమీక్షించి, రద్దు చేయాలన్నారు. ​పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLI) పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ​నల్గొండకు నీటి తరలింపు అవసరమైతే నాగార్జునసాగర్ నుండి తీసుకోవచ్చని, మహబూబ్‌నగర్ జిల్లా తల్పులపల్లి ఆయకట్టు భూములు, గ్రామాలు, రైతాంగ జీవితాలను ముంచవద్దని కోరారు. ​రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఈ నిర్ణయంపై పునఃసమీక్ష చేసి, జిల్లాకు సాగునీటి న్యాయం అందించాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల సాధన జేఏసీ కోరిందన్నారు. ఈ కార్యక్రమం లో చెన్న కిష్టయ్య, ఎ. తిమ్మప్ప, జి. రంగస్వామి, చిన్నరాజప్ప,  నాయకులు, ప్రతినిధులు ఉన్నారు.

మరిన్ని వార్తలు