అధునాతన అంగులతో బస్ టెర్మినల్
రూ.3.2 కోట్లతో సిటీ బస్ టెర్మినల్
100 రోజుల్లో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
మేడిపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(Telangana State Road Transport Corporation) ద్వారా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు,మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar Goud) తెలిపారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్–10, ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్ వద్ద రూ.3.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిటీ బస్ టెర్మినల్‌ను ఆయన శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, మేడ్చల్ డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్ వద్ద నిర్మించనున్న నూతన బస్ టెర్మినల్‌తో ప్రయాణికుల ఇబ్బందులు తగ్గనున్నాయని, ఈ ప్రాంతం నుంచి రోజూ 1,053 బస్సు ట్రిప్పులు నడుస్తున్నాయని, లక్ష మంది వరకు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అధునాతన వసతులతో టెర్మినల్‌ను నిర్మించనున్నట్లు వివరించారు.
బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల పేర్లతో కొత్త బస్ స్టేషన్‌కు నామకరణం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ టెర్మినల్ నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, హనుమకొండ, వరంగల్ , భద్రాచలం, సూర్యాపేట తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా బస్ స్టేషన్‌లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నామని మంత్రి తెలిపారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బస్ స్టేషన్ నిర్మాణానికి నిధులు కేటాయించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసి 100 రోజుల్లో వినియోగంలోకి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా ఇప్పటివరకు 367 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయని, ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు రూ.12, 88కోట్లు ఆదా చేసుకున్నారని మంత్రి వివరించారు. పండుగ రోజుల్లోనూ ఆర్టీసీ సిబ్బంది సేవలు అందిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారని గుర్తుచేశారు. ఆర్టీసీ సంస్థను పరిరక్షించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
అవసరమైన ప్రాంతాల్లో కొత్త బస్సు రూట్ల వేస్తామని అన్నారు. ఆర్టీసీలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటివరకు 3,000కు పైగా కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కొత్త రూట్లలోనూ బస్సులను నడుపుతున్నామని, నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. తొలి దశలో పాత డీజిల్ బస్సుల్లో 250 బస్సులను రీట్రోఫిట్ చేసే ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు.
క్లీన్ అర్బన్ రవాణా దిశగా ఈవీ ఆటోలకు రూ.200 కోట్లు కేటాయించినట్లు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు ఈవీ పాలసీ కింద పన్ను రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రత కోసం రిఫ్లెక్టర్లు, స్క్రాప్ పాలసీతో పాటు ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన దాదాపు రూ.1,400 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లించే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించినట్లు మంత్రి తెలిపారు.
గతంలో పెండింగ్‌లో ఉన్న సీసీఎస్, పీఎఫ్ బకాయిలను విడతలవారీగా చెల్లిస్తున్నామని,పదేళ్లుగా జరగని ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలను నిర్వహించామని, ఎన్నికైన గుర్తింపు సంఘంతో కమిటీ ఏర్పాటు చేసి విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఉద్యోగులకు 2 పీఆర్సీలు అమలు చేశామని, డీఏ బకాయిలు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడం, బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, కార్మికుల సమస్యలను పరిష్కరించడం ద్వారా ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిర్జాది గూడ, బోడుప్పల్ మాజీ మేయర్లు, నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.