ఇంటి ఇంటికో ఇంకుడు గుంత-భవిష్యత్ తరాలకు ఉండొద్దు నీటి చింత

04-10-2026 | 03:19pm

నేరేడుచర్ల మున్సిపల్ కమీషనర్ చెన్నబోయిన నాగరాజు

నేరేడుచర్ల, అక్టోబర్ 04 (విజయక్రాంతి): ఇంటి ఇంటికో ఇంకుడు గుంత నిర్మించుకోవడం ద్వారా, భవిష్యత్ తరాలకు నీటి చింత లేకుండా చేయొచ్చని నేరేడుచర్ల మున్సిపల్ కమీషనర్ చెన్నబోయిన నాగరాజు(Municipal Commissioner Chennaboina Nagaraju) ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రస్తుత సంక్షుభిత పరిస్థితుల్లో మనమందరం అత్యంత కీలకమైన అంశంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తీవ్రమైన ఎల్‌నినో వాతావరణ ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షపాతం గణనీయంగా తగ్గిందన్నారు. ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో భూమి వేడెక్కి, భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని తెలిపారు.

ప్రతి నీటి బొట్టు భవిష్యత్తుకు రక్షణే అని, మిషన్ భగీరథ ద్వారా వస్తున్న తాగునీటిని అవసరమైన మేరకు మాత్రమే వాడుకోవాలన్నారు. ప్రతి ఇంటి నల్లాకు తప్పనిసరిగా ట్యాపులు బిగించుకోవాలని, నీటిని వృథాగా రోడ్లపైకి, కాలువల్లోకి వదలకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ఇష్టానుసారంగా నీటిని వృథా చేస్తే, రాబోయే కాలంలో మున్సిపాలిటీ తరపున కఠినమైన ఆంక్షలు, చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని ప్రజలందరూ ఈ తీవ్రతను గుర్తించి,నీటి సంరక్షణలో మున్సిపల్ యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు