పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి
యువత, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం.. ఫామ్-18తో ఓటరుగా నమోదు కావాలి
గరిడేపల్లి,(విజయ కాంతి): వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి, హుజూర్‌నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం గరిడేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువత, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, గ్రూప్-1, పోలీసు నియామకాలు, డీఎస్సీ, జీవో 46, జీవో 29 తదితర అంశాల్లో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తోందన్నారు.ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల నిధుల విడుదలలో జాప్యంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఉద్యోగులకు పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని విమర్శించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల అభివృద్ధికి చర్యలు చేపట్టామని వారు పేర్కొన్నారు. కేసీఆర్ రైతులకు అనుకూలమైన విధానాలు అమలు చేశారని, తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఫామ్-18 నమోదుపై ప్రత్యేక దృష్టి
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులు గ్రామాలవారీగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నాయకులు సూచించారు. గరిడేపల్లి, గడ్డిపల్లి, కల్మలచెరువు సహా మండలంలోని అన్ని గ్రామాలు, తండాల్లో డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన యువతీ యువకులను గుర్తించి ఫామ్-18 ద్వారా ఓటర్లుగా నమోదు చేయించాలని కోరారు. ప్రతి అర్హుడూ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం దరఖాస్తు సమర్పించి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో హుజూర్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, జక్కుల నాగేశ్వరరావు, కొప్పుల సైదిరెడ్డి, సురేష్‌బాబు, మన్యం శ్రీనివాస్‌రెడ్డి, కేఎల్‌ఎన్ రెడ్డి,సర్పంచులు మాశెట్టి శ్రీహరి, బొలిశెట్టి సుధీర్, బొల్లెపల్లి రామనాథం, బొలిశెట్టి సుధీర్, పోలంపల్లి ఆనంద్ బాబు, పిడమర్తి అంజి,మన్సూర్ అలీ, తదితర ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.