రేషన్ ద్వారా గోధుమపిండి!
- కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి కూడా..
- పరిశీలిస్తున్నామన్న మంత్రి ఉత్తమ్
- రాష్ట్రంలో 14 నెలలపాటు ఆహార భద్రత
- ఎల్ నినో ముప్పును ఎదుర్కొనేందుకు సన్నద్ధత
అక్టోబర్ 19 (విజయక్రాంతి): ఎల్ నినో(El Niño) ప్రభావంతో తలెత్తే వర్షాభావం, పంట నష్టాలు, ఆహార ధరల పెరుగుదలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభు త్వం ముందస్తు చర్యలు చేపడుతున్నదని పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖల మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థపై(Public Distribution System) ఆధారపడిన 3.42 కోట్ల ప్రజల ఆహార భద్రతకు(Food Security) భరోసా కల్పించేలా, 14 నెలల వరకు వారి అవసరాలను తీర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ(Department of Civil Supplies) ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ధరల పెరుగుదల వల్ల పేద కుటుంబాలపై పడే భారాన్ని తగ్గించేందుకు రేషన్ వ్యవస్థ ద్వారా గోధుమపిండితోపాటు ఎంపిక చేసిన నిత్యావసర వస్తువులను అందించే అవకాశాన్ని మంత్రి పరిశీలించారు. గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి తదితర వస్తువుల పంపిణీ అంశం సమీక్షలో చర్చకు వచ్చింది.
సబ్సిడీ ధరలకు అందించడంతోపాటు వివిధ పంపిణీ విధానాలకు సంబంధించిన వ్యయ అంచనాలను అధికారులు సమర్పించారు. లబ్ధిదారులకు అందించాల్సిన పరిమాణాలు, సరుకుల సేకరణ, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని సమగ్రంగా లెక్కించాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. ఈ వివరాల తో ప్రతిపాదన సిద్ధం చేసిన అనంతరం పంపిణీ పై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
నెలకు 2.38 లక్షల టన్నుల బియ్యం
రాబోయే వ్యవసాయ సీజన్లలో వర్షపాతం తగ్గినా రేషన్ సరఫరాలకు అంతరాయం కలగకుండా ధాన్యం సేకరణ, బియ్యం నిల్వల నిర్వహణకు ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. రానున్న వరి పంట దిగుబడిపైనే పూర్తిగా ఆధారపడకుండా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ప్రజాపంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం కింద మధ్యాహ్న భోజనం తదితర అవసరాలకు కలిపి నెలకు సుమారు 2.38 లక్షల టన్నుల బియ్యం అవసరమని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
ఈ లెక్కన వార్షిక అవసరం 28.56 లక్షల టన్నులుగా ఉందని ఆయన అన్నారు. 2026 అక్టోబర్ 16 నాటికి రాష్ట్రంలోని బఫర్ గోదాముల్లో 9.64 లక్షల టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. ఇందులో కేంద్ర పూల్, ఇతర సంక్షేమ పథకాల కింద 3.50 లక్షల టన్నులు, రాష్ట్ర పూల్ కింద 6.14 లక్షల టన్నులు ఉన్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్), ఇతర గుర్తించిన సరఫరాల ద్వారా మరో 18.39 లక్షల టన్నుల బియ్యం అందాల్సి ఉందన్నారు.
ప్రస్తుత నిల్వలు, అందాల్సిన బియ్యం కలిపితే మొత్తం లభ్యత 28.03 లక్షల టన్నులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ పరిమాణం ప్రజాపంపిణీ, ఇతర సంక్షేమ పథకాల అవసరాలకు సుమారు 11.7 నెలలపాటు, అంటే 2027 సెప్టెంబర్ వరకు సరిపోతుందని వారు వివరించారు.
మిల్లర్లు, ఇతర వనరుల నుంచి రావాల్సిన బియ్యం నిర్ణీత గడువులోగా ప్రభుత్వ గోదాములకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలతో భవిష్యత్తులో పంటలు దెబ్బతిన్నా లక్షలాది కుటుం బాల ఆహార భద్రతకు భంగం కలగకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. సమీక్షలో పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.