సంతోషిమాత విగ్రహంపై దాడి
- - దిల్ సుఖ్ నగర్ లోని సంతోషిమాత ఆలయంలో, అమ్మవారి విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తి దాడి
- - నిందితుడికి దేహశుద్ధి చేసిన భక్తులు
- - హిందూ మతంపై ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఆరోపణ
- - ఆందోళనలు చేపట్టిన బీజేపీ, జనసేన, హిందూ సంఘాలు
- - కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు
ఎల్బీనగర్, అక్టోబర్ 2: దిల్ సుఖ్ నగర్ భవానీనగర్ కాలనీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సంతోషిమాత దేవాలయం(Santoshimata Temple)లో శుక్రవారం ఉదయం అమ్మవారికి పూజలు జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి కర్రలతో అమ్మవారి విగ్రహంపై దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పూజారి, భక్తులు పూజలు చేస్తున్న సమయంలోనే ఘటన జరగడం పట్ల చర్చనీయాంశం అయింది.
దేవాలయంలో ఉన్న భక్తులు, స్థానికులు, పోలీసులకు సమాచారం అందించడంతో చైతన్యపురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. ఆలయ చైర్మన్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఎల్బినగర్ ఎసిపి రవీంద్రారెడ్డి, చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.
- బీజేపీ నాయకుల ఆందోళన, నిరసన
సంతోషిమాత దేవాలయంపై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. నిందితుడికి మానసిక పరిస్థితి సరిగా లేదని, ఈ ఘటనపై నామమాత్రంగా కేసు నమోదు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి అర్బన్ బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, రంగా నర్సింహగుప్తా, కొప్పుల నర్సింహరెడ్డి, రాధాధీరజ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ... దేవాలయంపై దాడి చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యని ఇలాంటి ఘటనలను పోలీసులు తేలికగా తీసుకోవడం సరికాదన్నారు. నిందితుడిపై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని దేవాలయాలకు తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ నాయకులు, యువకులు దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దేవాలయంపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకునే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈకార్యక్రమంలో ముసారాంబాగ్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి మధుసూదన్ రెడ్డి, బీజేపీ నాయకులు రుద్రారపు శంకర్, కుల్దీప్, డివిజన్ అధ్యక్షులు దాసరి జయప్రకాష్, నవీన్ యాదవ్, సతీష్ చారీ, సందీప్, రఘునందన్ జోషి, టింకు, శశాంక్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
- ఆలయాలకు రక్షణ కల్పించాలి
- జనసేన నాయకులు రాజలింగం, శిరీష
సంతోషి మాత ఆలయంలో అన్యమతస్థుడి వికృత చర్యలపై జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన ఎల్బీనగర్ ఇన్ చార్జి సాయి శిరీష, గ్రేటర్ హైదరాబాద్ ఇన్ చార్జి రాజలింగం తన అనుచరులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళనతో చేపట్టారు.
ఈ సందర్భంగా రాజలింగం మాట్లాడుతూ... హిందూ ఆలయలపై దాడులను అరికట్టాలన్నారు. దిల్ సుఖ్ నగర్ లోని సంతోషిమాత ఆలయంలో అమ్మవారి విగ్రహంపై దాడి చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. రోజుకు నాలుగుసార్లు నమాజ్ చేసే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా దాడి చేశాడని ఆరోపించారు. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.