సియాట్ ప్లాట్లలోకి చొరబాటు.. సినీ నిర్మాతపై ఫిర్యాదు
మాదాపూర్ పోలీసులను ఆశ్రయించిన సొసైటీ
శేరిలింగంపల్లి,సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): మాదాపూర్‌లోని సున్నం చెరువు ప్రాంతంలో తమ ప్లాట్లను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ సియాట్ సొసైటీ ప్లాట్ (Ciaat Society Plot) యజమానులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సినీ నిర్మాత సి.కళ్యాణ్‌తో (Film producer C. Kalyan) పాటు ప్రకాష్ ధారక్, ప్రేమలత తదితరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సింగ్ ఆధ్వర్యంలో ప్లాట్ యజమానులు శనివారం పోలీసులను కలిశారు. గుట్టల బేగంపేట, సున్నం చెరువు పరిధిలోని సర్వే నంబర్లు 12, 12ఏ, 13లో తమకు ప్లాట్లు ఉన్నాయని, వాటిపై హక్కు పత్రాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
శనివారం ఉదయం కొందరు వ్యక్తులు తమ ప్లాట్లలోకి ప్రవేశించి బ్లూ షీట్లు ఏర్పాటు చేశారని యజమానులు ఆరోపించారు. అనుమతి లేకుండా ప్రవేశించి అడ్డంకులు సృష్టిస్తున్నారని, దీనివల్ల తమకు ప్లాట్లలోకి వెళ్లే అవకాశం లేకుండా పోతోందని చెప్పారు.గతంలో కూడా ఇదే ప్లాట్లపై ఆక్రమణ ప్రయత్నాలు జరిగాయని, అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొంతకాలం పాటు ఆ ప్రయత్నాలు ఆగిపోయాయని సొసైటీ సభ్యులు తెలిపారు.
తాజాగా మళ్లీ అదే పద్ధతిలో చొరబాటు జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని, అనుమతి లేకుండా షీట్లు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్లాట్ యజమానులు పోలీసులను కోరారు.ఈ కేసులో భూములపై అసలు హక్కులు ఎవరికి ఉన్నాయి, సర్వే రికార్డులు ఏమిటి, షీట్లు ఎవరు పెట్టారు, అనుమతులు ఉన్నాయా అనే అంశాలపై పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.