అక్రమ కట్టడాలకు ‘అధికారిక’ ముద్ర!?

17-11-2026 | 05:15am
  1. ఆదిభట్ల సర్కిల్‌లో నిబంధనలకు పాతర.. 
  2. అనుమతుల్లేని రిసార్టులు, భారీ షెడ్లకు ఇంటి నంబర్లు
  3. సామాన్యుడికి సవాలక్ష కొర్రీలు.. 
  4. బడాబాబులకు మాత్రం ‘రెడ్ కార్పెట్’ అసెస్మెంట్?
  5. జీహెచ్‌ఎంసీ ఖజానాకు భారీ గండి.. ఉన్నతాధికారుల నిఘా ఏదీ?

ఆదిభట్ల, నవంబర్ 16 (విజయక్రాంతి): కనీస నిర్మాణ అనుమతులు లేవు..  నాలా పత్రాలు(Nala Documents) కానరావు.. అగ్నిమాపక, వాణిజ్య శాఖల(Fire and Commercial Department) నిరభ్యంతర పత్రాల ఊసే లేదు! అయినా సరే, రాత్రికి రాత్రే వెలిసిన భారీ కమర్షియల్ షెడ్లు(Commercial Sheds), విలాసవంతమైన రిసార్టులకు దర్జాగా ‘ఇంటి నంబర్లు(House numbers)’  మంజూరైపోతున్నాయి.

ఆదిభట్ల సర్కిల్ పరిధిలో జీహెచ్‌ఎంసీ నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ ‘అసెస్మెంట్ దందా(Assessment Racket)’ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక సామాన్యుడు చిన్న రేకుల షెడ్డుకు ఇంటి నంబర్ కావాలంటే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకునే అధికారులు, బడా నిర్మాణాలకు మాత్రం కళ్లు మూసుకుని నంబర్లు ఎలా కేటాయిస్తున్నారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనలు గాలికి.. ‘అసెస్మెంట్’ వెనుక మతలబేంటి?

జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం, ఏదైనా కట్టడానికి ఇంటి నంబర్ (ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ ) కేటాయించాలంటే బిల్డింగ్ పర్మిషన్ కాపీ, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC), మరియు స్థల యాజమాన్య పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా కమర్షియల్ షెడ్లు, రిసార్టుల విషయంలో టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతి తప్పనిసరి. కానీ, ఆదిభట్ల సర్కిల్లో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేని అక్రమ నిర్మాణాలకు, వ్యవసాయ భూముల్లో వెలిసిన కమర్షియల్ షెడ్లకు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ విభాగం సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే నంబర్లు జారీ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంటి నంబర్ ఉంటే.. అక్రమం కాస్తా సక్రమమేనా?

ఒక్కసారి జీహెచ్‌ఎంసీ నుంచి ఇంటి నంబర్ జారీ అయితే, దాని ఆధారంగా విద్యుత్ కనెక్షన్లు (కమర్షియల్ మీటర్లు), ట్రేడ్ లైసెన్సులు పొందడం సులభమవుతుంది. భవిష్యత్తులో కూల్చివేతల నుంచి తప్పించుకోవడానికి, బ్యాంకు రుణాలు పొందడానికి ఈ ‘ఇంటి నంబర్’ అక్రమార్కులకు ఒక ఆయుధంగా మారుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరుఅక్రమార్కులు, అధికారులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రిసార్టులు, గోదాములకు చకచకా నంబర్లు పొందుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

సామాన్యుడికి చుక్కలు.. బడా బాపులకు సులువుగా..

‘మేము వంద గజాల్లో ఇల్లు కట్టుకుని నంబర్ కోసం దరఖాస్తు చేస్తే, అది లేదు, ఇది లేదు అంటూ నెలల తరబడి తిప్పుకుంటారు. కానీ, ఎకరాల కొద్దీ విస్తీర్ణంలో వెలిసిన భారీ షెడ్లు, రిసార్టులకు మాత్రం దరఖాస్తు చేసిన కొద్ది రోజుల్లోనే నంబర్లు ఎలా వస్తున్నాయి?‘ అని స్థానికులు నిలదీస్తున్నారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల మధ్య సమన్వయ లోపమా? లేక ‘మామూళ్ల’ మత్తులో అధికారులు ఫైళ్లను కదిలిస్తున్నారా? అన్నఅనుమానాలువ్యక్తమవుతున్నాయి.

ప్రత్యేక విచారణతోనే అసలు గుట్టు రట్టు..

ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగం ఆదిభట్ల సర్క్పి ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.గత ఏడాది కాలంలో ఆదిభట్ల సర్కిల్లో జారీ అయిన కొత్త ఇంటి నంబర్ల ముఖ్యంగా కమర్షియల్, రిసార్టుల రికార్డులను ఆడిట్ చేయాలి. టౌన్ ప్లానింగ్ అనుమతి లేకుండా జారీ చేసిన నంబర్లను తక్షణమే రద్దు చేయాలి.నిబంధనలకు విరుద్ధంగా ఫైళ్లను ఆమోదించిన క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు