రెవెన్యూ గుట్టలకు అక్రమ మట్టి తవ్వకాల గండం

22-09-2026 | 08:15pm

స్కూల్‌ భవనానికి పొంచిన ప్రమాదం.. పర్యావరణానికి తీవ్ర నష్టం

కోనరావుపేట, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం(Konaraopet Mandal) నిమ్మపల్లి గ్రామంలోని రెవెన్యూ గుట్టలు అక్రమ మట్టి తవ్వకాలతో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు సెలవు దినాల్లో, రాత్రి వేళల్లో జేసీబీలతో గుట్టల మట్టిని తవ్వి తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

రాజకీయ పలుకుబడితో ఈ వ్యవహారం సాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిమ్మపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఆనుకుని ఉన్న రెవెన్యూ గుట్టను తవ్వడం వల్ల ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గుట్టను తవ్వడంతో బండరాళ్లు, గుండ్లు వాటి కింద ఉన్న మట్టి తొలగిపోయి పాఠశాల భవనాల వైపు జారిపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 500 మంది విద్యార్థులు చదువుతున్నందున అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.

సహజసిద్ధంగా ఏర్పడిన ఈ గుట్ట గ్రామానికి ప్రకృతి పరంగా రక్షణగా నిలుస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గుట్టలపై ఉన్న చెట్లను తొలగించి మట్టి తవ్వకాలు చేపట్టడంతో పర్యావరణానికి నష్టం కలుగుతోందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా గ్రామంలోని ఊరుతండాను ఆనుకుని ఉన్న గుట్టతో పాటు మూలవాగును ఆనుకుని ఉన్న రెవెన్యూ గుట్టల్లోనూ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

మూలవాగు పరిసరాల్లో గుట్టల మట్టి తొలగించడం వల్ల భవిష్యత్తులో నీటి వనరులు, ప్రాజెక్టు భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.రెవెన్యూ గుట్టలు పూర్తిగా కనుమరుగైతే భవిష్యత్ తరాలకు వాటి ఆనవాళ్లు కూడా మిగలవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిమ్మపల్లిలో జరుగుతున్న మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్‌ విచారణ జరిపి, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, ప్రకృతి ప్రేమికులు, కోరుతున్నారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ గుట్టలను పరిరక్షించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు