సేవా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టుల రక్తదాన శిబిరం
సంగారెడ్డి, సెప్టెంబర్ 22: తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(Telangana State Union of Working Journalists) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం సంగారెడ్డి ఐబీలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది.
సంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ పాండు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, జెడ్పీ సీఈవో జానకి రెడ్డి, జిల్లా యువజన సంక్షేమ అధికారి అఖిలేష్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ తదితరులు రక్తదాన శిబిరం నిర్వహణను అభినందించారు.
ఈ సందర్భంగా బండారు యాదగిరి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం సంఘం నిరంతరం పనిచేస్తోందన్నారు. గ్రామీణ జర్నలిస్టుల బస్‌పాస్‌లు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. ఫైసల్ మార్గనిర్దేశంలో శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ శ్రీహరి, బీజేపీ సీనియర్ నేత జగన్ యాదగిరిని శాలువాలతో సత్కరించారు.