వరికి మోగి పురుగు.. అన్నదాతల్లో ఆందోళన
పెస్టిసైడ్స్ ఖర్చులతో కుంగిపోతున్న రైతులు
మండలంలో 16 వేల 500 ఎకరాల్లో వరిసాగు
గంభీరావుపేట, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): అరకొర వర్షాలతో ఆలస్యంగా వానాకాలం వరి సాగు ప్రారంభించిన రైతులు ఇప్పుడు తెగుళ్ల బెడదతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటపై మోగి పురుగు విస్తరిస్తూ పంటను నాశనం చేస్తోంది.
అంతేకాకుండా ఆకుముడత, కాండం తొలచు పురుగు వంటి ఇతర తెగుళ్లు కూడా వేగంగా వ్యాపిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.మండల వ్యాప్తంగా దాదాపు 16వేల 500 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన వరి పంటకు నాట్లు వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నప్పటికీ, ఇప్పటికే రెండుసార్లు మందులు పిచికారి చేసినా తెగుళ్ల ఉధృతి తగ్గడం లేదు.
పెరుగుతున్న పురుగుమందుల ఖర్చులతో రైతులపై ఆర్థిక భారం మరింతగా పెరుగుతోంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తున్న రైతులు, చివరకు తెగుళ్ల కారణంగా నష్టాలు చవిచూస్తున్నామని వాపోతున్నారు. “పంట కాపాడుకోవాలంటే మరిన్ని సార్లు మందులు పిచికారి చేయాల్సి వస్తోంది.ఖర్చులు భరించలేని స్థితి అని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
ఈ నేపథ్యంలో రైతులు తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పొలం గట్ల వద్ద కలుపు నివారణ చేయడం, యూరియా వినియోగాన్ని తగ్గించడం, తెగుళ్ల స్వభావాన్ని బట్టి వ్యవసాయ అధికారుల సలహా మేరకు సరైన మందులు పిచికారి చేయాలి.రైతులు తమ పంటలను తరచుగా పరిశీలిస్తూ ప్రారంభ దశలోనే తెగుళ్లను గుర్తించి నియంత్రణ చర్యలు తీసుకుంటే నష్టాలను తగ్గించుకోవచ్చు.
సలావుద్దీన్ మండల వ్యవసాయ అధికారి గంభీరావుపేట
మందులు కొట్టిన తగ్గడం లేదు
అరకొర నీటితో నాలుగు ఎకరాల్లో వరిసాగు చేసిన. పొలానికి మొగి పురుగు సోకింది. ఇప్పటికే రెండు సార్లు మందులు కొట్టినా పురుగు ఉదృతి తగ్గడం లేదు.ఆలస్యంగా కురిసిన వర్షాలతో నాట్లు వేస్తే తెగుళ్ళతో పంటకు నష్టం వాటిల్లుతుంది.
దాసరి చెంద్రం, రైతు నర్మాల