లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి
పోలీస్ అధికారులకు సీనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది సూచన
మంథని, సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి): ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్(Lok Adalat)లో రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించేలా పోలీస్ అధికారులు చొరవ చూపాలని మంథని సీనియర్ సివిల్ జడ్జి అపర్ణ(Civil Judge Aparna) మల్లాది కోరారు.
శనివారం మంథని కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల అంగీకారంతో కేసులను సత్వరమే పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అర్రా సుధారాణి, మంథని సీఐ బుద్ధే స్వామి, ఎస్‌ఐలు తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.






