ఖబర్దార్ బిడ్డా.. రా తేల్చుకుందాం
కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్(MLC Dande Vithal) తనపై చేసిన విమర్శలకు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Koneru Konappa) ఘాటుగా స్పందించారు. కాగజ్‌నగర్(Kagaznagar)లోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దండే విఠల్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కోనప్ప మాట్లాడుతూ.. “దండే విఠల్.. చెంచాగిరి చేసి ఎమ్మెల్సీ పదవి పొందావు. 2024 వరకు కాలేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) గురించి ఎందుకు మాట్లాడలేదు? ప్రాజెక్టు తరలిపోతుంటే ఎందుకు అడ్డుకోలేదు? కనీసం వినతిపత్రం కూడా ఎందుకు ఇవ్వలేదు?” అని ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉండి తనపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం సరికాదన్నారు.
తనను విమర్శించే ముందు దండే విఠల్ తన రాజకీయ స్థాయి, గతాన్ని తెలుసుకోవాలని కోనప్ప సూచించారు. 2024 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు విఠల్‌కు వచ్చిన ఓట్లు, తాను కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో సాధించిన ఓట్లను ప్రజలు గమనించారని అన్నారు. “నీకెన్ని ఓట్లు వచ్చాయో, నాకు ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రజలకు తెలుసు” అని పేర్కొన్నారు.
తన నాలుక కోస్తానంటూ దండే విఠల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “ఖబర్దార్ బిడ్డా.. నా వెంట్రుక కూడా పీకలేవు. నేను ఇంటికాడనే ఉంటా.. రా, ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందాం” అంటూ సవాల్ విసిరారు. తనకు ప్రస్తుతం గన్‌మెన్‌లు లేకపోయినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ప్రజల కోసం పనిచేస్తున్నానని కోనప్ప తెలిపారు. ఇకపై తన స్థాయికి మించి మాట్లాడటం మానుకోవాలని దండే విఠల్‌ను హెచ్చరించారు.






