సిర్పూర్‌లో ముదురుతున్న రాజకీయ మాటల యుద్ధం
‘దమ్ముంటే నా గెలుపును అడ్డుకో’
కోనప్పకు ఎమ్మెల్సీ దండే విఠల్ సవాల్
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రాజకీయాల్లో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. రాబోయే ఎన్నికల్లో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని, దమ్ముంటే తన గెలుపును అడ్డుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్(MLC Dande Vithal) మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Koneru Konappa)కు సవాల్ విసిరారు.
కాగజ్‌నగర్‌లోని తన నివాసంలో నిర్వహించిన అత్యవసర మీడియా సమావేశంలో దండే విఠల్ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరు ఏం చేశారో, ఇకపై ఎవరు ఏం చేయబోతున్నారో ప్రజల ముందే తేల్చుకుందామని అన్నారు.
కౌటాలలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను దండే విఠల్ తప్పుబట్టారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం విషయంలో మాట్లాడేటప్పుడు నాయకులు సంయమనం పాటించాలని సూచించారు.
22-ఏ నిషేధిత జాబితా, భూ సమస్యలకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోని ధరణి పోర్టల్‌లోని లోపాలే ప్రధాన కారణమని దండే విఠల్ ఆరోపించారు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలపై ప్రస్తుతం మాట్లాడుతున్న నాయకులు గతంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
తుమ్మిడిహెట్టి వద్ద ఉండాల్సిన ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించే సమయంలో ఎందుకు అడ్డుకోలేదని, కనీసం ప్రభుత్వానికి వినతిపత్రం కూడా ఎందుకు సమర్పించలేదని నిలదీశారు. గతంలో సుదీర్ఘకాలం నియోజకవర్గంపై ఆధిపత్యం చెలాయించిన నాయకుల వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
దండే విఠల్ తాజా వ్యాఖ్యలతో సిర్పూర్ నియోజకవర్గంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్ మధ్య కొనసాగుతున్న విమర్శలు, ప్రతివిమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.






