పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి

12-11-2026 | 06:09pm

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యవహారశైలిపై విచారణ జరిపి, పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి సెగ్గం రాజేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా సెగ్గం రాజేశం మాట్లాడుతూ.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కనీస ప్రోటోకాల్ పాటించకుండా పర్యటించడం సరికాదన్నారు. మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, అధికార ప్రతినిధులు, మండల అధ్యక్షులకు సమాచారం ఇవ్వకుండా వ్యక్తిగత కార్యక్రమాల పేరుతో పర్యటించడం పార్టీ శ్రేణుల్లో అసహనానికి కారణమవుతోందని ఆరోపించారు.

ముఖ్యంగా పరామర్శల పేరుతో బీఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా వ్యవహరించడం, వారి కుటుంబ సభ్యులను సందర్శించడం వల్ల ప్రజల్లో ఎంపీ రాజకీయ వైఖరిపై గందరగోళం నెలకొందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎంపీగా పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణకు అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మంత్రి శ్రీధర్ బాబు తన రాజకీయ అనుభవం, చాకచక్యంతో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేశారని గుర్తుచేశారు. అలాంటి సీనియర్ నాయకుడిపై ఎంపీ వంశీకృష్ణ బహిరంగ లేఖల ద్వారా విమర్శలు చేయడం, వ్యంగ్యంగా మాట్లాడటం బాధాకరమన్నారు.

అలాగే ఎంపీ ల్యాడ్స్ నిధుల కేటాయింపులోనూ మంత్రి శ్రీధర్ బాబుతో సమన్వయం లేకుండా బీఆర్ఎస్ నాయకులకు నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఎంపీ ఏకపక్ష నిర్ణయాలు, వ్యవహారశైలి మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం ఉందన్నారు. పార్టీ అధిష్ఠానం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి సమగ్ర విచారణ చేపట్టి, ఎంపీ గడ్డం వంశీకృష్ణపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సెగ్గం రాజేశం కోరారు.

మరిన్ని వార్తలు