నర్సాపూర్‌లో ఆక్రమణల ‘రాచబాట’!

21-09-2026 | 05:05am
  1. కబ్జాదారుల గుప్పిట్లో ప్రధాన రహదారి.. స్తంభిస్తున్న ట్రాఫిక్
  2. ‘అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ’ స్లాబ్లపై చిరువ్యాపారుల దౌర్జన్యం.. ఫుట్‌పాత్‌లు మాయం
  3. నడిరోడ్డుపై నడక.. మున్సిపల్ పర్యవేక్షణ శూన్యం, పోలీసుల నిర్లక్ష్యం
  4. గల్లీ రోడ్డులా మెయిన్ రోడ్డు.. వాహనదారులు, పాదాచారులకు నిత్యం నరకయాతన

నర్సాపూర్, సెప్టెంబర్ 20 : వ్యాపార కేంద్రంగా పేరుగాంచిన నర్సాపూర్ పట్టణం(Narsapur town)లో ప్రధాన రహదారి ఆక్రమణల(Road encroachments) పర్వంతో రోజురోజుకూ తీవ్రంగా కుంచించుకుపోతోంది. నర్సాపూర్ పట్టణానికి నిత్యం చుట్టుపక్కల మండలాల నుంచి వేలాది మంది ప్రజలు వివిధ పనుల కోసం వస్తుంటారు. అయితే మున్సిపల్ అధికారుల(Municipal officials) పర్యవేక్షణ లోపమా, పోలీసుల నిర్లక్ష్యం వల్లనా  పట్టణంలో నిత్యం తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు(Traffic problems) తలెత్తుతున్నాయి. పేరుకే మెయిన్ రోడ్డు తప్ప, కుడి-ఎడమల ఆక్రమణలతో గల్లీ రోడ్డును తలపిస్తోంది.

ఫుట్‌పాత్‌ల ఆక్రమణ.. నడిరోడ్డుపై పాదాచారులు!

పట్టణంలో రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ‘765‘డి ఇది మెదక్ నుండి నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న నిర్మాణాలు తొలగించి, 100 ఫీట్ల వెడల్పుతో విస్తరించారు. రూ. కోట్ల ఆర్‌అండ్ బీ నిధులు వెచ్చించి రోడ్డు వేశారు. నర్సాపూర్ లో రోడ్డుకు ఇరువైపులా అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించి, దానిపై లక్షల మున్సిపల్ నిధులతో పాదాచారులు నడిచేందుకు వీలుగా ఫుట్పాత్ స్లాబ్లు వేశారు. అయితే, ఈ ఫుట్పాత్లన్నీ ప్రస్తుతం ఆక్రమణదారుల గుప్పిట్లోకి వెళ్లాయి.

రకరకాల చిరువ్యాపారులు, తోపుడుబండ్లు, దుకాణాదారులు ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డు పక్కన భవనాల్లోని షట్టర్లలో ఏర్పాటు చేసిన దుకాణాల యజమానులు సైతం తమ తమ షాపుల ఎదుట ఫుట్పాత్ను ఆక్రమించి సామాగ్రి పెట్టుకుంటున్నారు. దీంతో ఫుట్పాత్ ఉందనే సంగతే కనిపించని పరిస్థితి నెలకొంది. పాదాచారులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని నడిరోడ్డుపైనే నడవాల్సిన దుస్థితి ఏర్పడింది.

అడ్డ దిడ్డంగా పార్కింగ్.. 1 కి.మీ ప్రయాణానికి కష్టతరం

ఇది చాలదన్నట్లు దుకాణాలకు వచ్చే కొనుగోలుదారులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. మరోవైపు ఆటోలు ఎక్కడపడితే అక్కడ రోడ్డుపైనే నిలుపుతున్నారు. పది అడుగుల వరకు రోడ్డు పార్కింగ్, చిరువ్యాపారాలకే వినియోగించడం, ఆటోల పార్కింగ్, మధ్యలో డివైడర్ ఉండటంతో మెయిన్ రోడ్డు కాస్తా ’సింగిల్ రోడ్డు’ను తలపిస్తోంది. ఒకవైపు 50 అడుగుల రోడ్డు ఉన్నా.. ఆక్రమణలు, పాదాచారులతో రెండు వాహనాలు పక్కపక్కనే వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. దీంతో రద్దీ వేళల్లో ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యంగా మారింది. సాధారణంగా కిలోమీటర్ దూరానికి ప్రయాణించడానికి కష్టతరం అవుతోంది.

వారాంతపు సంత రోజున.. రచ్చరచ్చ

సాధారణ రోజుల్లో పరిస్థితి ఇలా ఉంటే, ప్రతి శుక్రవారం , మంగళవారం జరిగే నర్సాపూర్ వారంతపు సంత రోజున పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతోంది. సంత రోజున వేలాది మంది ప్రజలు, వందలాది వాహనాలు రావడం, రోడ్డునే ఆక్రమించి వ్యాపారాలు చేయడంతో పట్టణం మొత్తం ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటోంది.

దుకాణదారుల దౌర్జన్యం... బాధితులపైనే ‘ముక్కుపిండి’ వసూళ్లు!

ఫుట్పాట్లను ఆక్రమించి వ్యాపారాలు చేసేవారు రోడ్డున పోయే వాహన దారులపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. పొరపాటున ఉన్న బండి ఏమైనా తమ సామాగ్రికి లేదా బోర్డులకు తగిలితే సదరు వ్యాపారు లు రచ్చరచ్చ చేస్తున్నారు. అసలు బాధితులు తమను క్షమించమని కోరినా వినకుండా, తమ దుకాణాల్లోకి బండి దూసుకు వచ్చిందని, సామాగ్రి ధ్వంసమైందని సాకులు చెబుతూ ముక్కుపిండి వేలల్లో రూపాయలు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు.

అధికారుల మౌనం వెనుక మతలబేంటి?

‘ముందు ఓ వాహనం పోతుందంటే ఇక దాని వెనకే వెళ్లాల్సిందే, పక్క నుండి ఇంకో బండి వెళ్లడానికి కూడా స్థలం ఉండదు....ఇదేమిటని మున్సిపల్ సిబ్బంది అడగరు.. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతున్నా పోలీసులు పట్టించుకోరు! కోట్లు వెచ్చించి నిర్మించిన రహదారులు, ఫుట్పాత్లు ఆక్రమణదారుల పాలవుతున్నా అధికారులు మౌనంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వ్యక్త మవుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, పోలీసులు తక్షణమే స్పందించి ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఆక్రమణలు తొలగించి, రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించా లని ప్రజలు కోరుతున్నారు.

వైట్‌లైన్ దాటితే కఠిన చర్యలు...

*ఎస్.ఐ రంజిత్ రెడ్డి

నర్సాపూర్ పట్టణంలో ఆటోలు, వాహనాల వల్ల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. రోడ్డుపై వైట్లైన్ దాటి నిలిపే ఆటోలపై ఇప్పటికే 10 ఆటోలపై, కేసులు నమోదు చేసి, ఫైన్లు వేస్తున్నామని,  పేర్కొన్నారు. రోడ్డు ఆక్రమించే పండ్ల బండ్లను ఇప్పటికే పూర్తిగా తొలగించామని స్పష్టం చేశారు. బైకుల పార్కింగ్ స్థలం కోసం మున్సిపాలిటీకి లేఖ రాశామని, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎంతటి వారిపై అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

*ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి పెనాల్టీలు విధిస్తున్నాం

సాయికుమార్ మున్సిపల్ కమిషనర్..

‘పట్టణంలో రోడ్లు, ఫుట్పాత్ల ఆక్రమణదారులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చి పెనాల్టీలు విధిస్తున్నాం. నిధుల సమస్య వల్ల ఆగిపోయిన ‘సమీకృత మార్కెట్’ నిర్మాణం పూర్తయితే తోపుడు బండ్ల వారికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.

మరిన్ని వార్తలు